Asianet News TeluguAsianet News Telugu

పల్నాడులో హత్యారాజకీయాలు... టిడిపి మండలాధ్యక్షుడిపై వైసిపి నాయకుడి కాల్పులు

పల్నాడు : ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకుల మధ్య రాజకీయ వైరం రోజురోజుకు మరింత ముదిరి హత్యారాజకీయాలకు దారితీస్తోంది.

పల్నాడు : ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకుల మధ్య రాజకీయ వైరం రోజురోజుకు మరింత ముదిరి హత్యారాజకీయాలకు దారితీస్తోంది. నాయకుల మాటల యుద్దం, బూతులు తిట్టుకోవడం కాస్తా భౌతిక దాడులు, కాల్పులతో ఒకరినొకరు చంపుకునే స్థాయికి చేరింది. పల్నాడు జిల్లాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా వుంది. ఇప్పటికే ఈ జిల్లాలో వైసిపి, టిడిపి నాయకుల గొడవలు తారాస్థాయికి చేరగా తాజాగా మాజీ ఎంపిపి, టిడిపి మండలాధ్యక్షుడిపై వైసిపి ఎంపిపి నాయకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. రొంపిచర్ల మండల టిడిపి అధ్యక్షుడు బాలకోటిరెడ్డి ఇంట్లోకి చొరబడి తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు వైసిపి ఎంపిపి భర్త గడ్డం వెంకట్రావు. అనుచరులు పమ్మి వెంకటేశ్వర్ రెడ్డి, పూజల రాముడుతో కలిసి అలవాల గ్రామంలోని బాలకోటిరెడ్డి ఇంటికి వెళ్లిమరీ తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. బులెట్ గాయాలతో కుప్పకూలిన బాలకోటిరెడ్డిని కుటుంబసభ్యులు నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద బాబు ఆస్పత్రికి చేరుకుని బాలకోటిరెడ్డిని పరామర్శించారు. టిడిపి నేతపై హత్యాయత్నం ముమ్మాటికీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పనేనని... దీనికి వైసిపి సర్కారే బాధ్యత వహించాలని హెచ్చరించారు.