టిడిపిలో చేరికపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి క్లారిటీ... వైసిపిపై పోటీకి సిద్దమే : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు : వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడటం ఖాయమయ్యింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి నుండి కాకుండా టిడిపి నుండి పోటీ చేయాలని బావిస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే స్వయంగా ప్రకటించారు.
నెల్లూరు : వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడటం ఖాయమయ్యింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి నుండి కాకుండా టిడిపి నుండి పోటీ చేయాలని బావిస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే స్వయంగా ప్రకటించారు. వైసిపి పార్టీకి వీరవిధేయుడినైన తనను అనుమానించి అవమానించారని... ఇక అవమానాలు భరించలేకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, పార్టీ పెద్దల ఆదేశాలతో తన ఫోన్ ను ట్యాప్ చేసి దొంగచాటుగా విన్నారని అన్నారు. తన స్నేహితుడితో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్ ను స్వయంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐ.జి. సీతారామాంజనేయులే ఇచ్చారన్నారు. ఈ ఫోన్ రికార్డింగ్ ద్వారా తనను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని అనుకున్నారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. కేవలం తన ఫోన్ మాత్రమే కాదు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా వైసిపి పెద్దలు ట్యాప్ చేయించారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నారని... వీరిలో 35 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, నలుగురు ఎంపిలు కూడా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలే ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. ఈ ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని శ్రీధర్ రెడ్డి తెలిపారు.