Asianet News TeluguAsianet News Telugu

మరో పదిరోజుల్లో పెళ్లి పెట్టుకుని... ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి సూసైడ్

ఏలూరు : మరో పదిరోజుల్లో అతడి పెళ్ళి... సంక్రాంతికి ఇంటికి వచ్చి ఇక్కడే వుంటూ పనులు చూసుకుంటున్నాడు.

ఏలూరు : మరో పదిరోజుల్లో అతడి పెళ్ళి... సంక్రాంతికి ఇంటికి వచ్చి ఇక్కడే వుంటూ పనులు చూసుకుంటున్నాడు. ఇంతలో ఏమయ్యిందో తెలీదు పెళ్లిపీటలెక్కి కొత్తజీవితాన్ని ప్రారంభించాల్సినవాడు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. దీంతో పెళ్లిబాజా మోగాల్సిన ఇంటిముందు చావుబాజ మోగింది. పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

జంగారెడ్డిగూడెం పంగిడిగూడెం గ్రామానికి చెందిన హరీష్ బాబు(33) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేస్తూ డిల్లీలో వుండేవాడు. అయితే ఈ నెల 16న అతడి పెళ్లి వుండటంతో స్వగ్రామానికి వచ్చాడు. పెళ్లిబట్టల కోసం నిన్న(శనివారం) తల్లితో ఏలూరు వెళ్లడానికి సిద్దమయ్యాడు. అయితే ఏమయ్యిందో తెలీదుగానీ బట్టలు మార్చుకుంటానని గదిలోకి వెళ్ళిన హరీష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి తలుపుతట్టగా సమాధానం రాలేదు. దీంతో చుట్టుపక్కల ఇళ్లవారి సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా హరీష్ ఉరితాడుకు వేలాడుతూ కనపించాడు. కిందకుదింపి చూడగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.