ఇంట్లో... బొద్దింకలు, ఇతర కీటకాలు తిరుగుతూ ఉంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది. వేసవి, వర్షాకాలంలో అయితే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. మరి ఈ బొద్దింకలను ఇంట్లో నుంచి ఎలా తరిమికొట్టాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే. ట్రై చేయండి.    

 

బొద్దింకలు, ఇతర కీటకాలు కిచెన్ లో, బాత్ రూమ్ మూలల్లో ఉండి చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. వీటి వల్ల కొన్నిసార్లు ప్రమాదకర వ్యాధులు కూడా రావచ్చు. వీటిని తరిమి కొట్టడానికి చాలామంది ఖరీదైన రసాయనాలు వాడుతుంటారు. కానీ కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో బొద్దింకలను ఈజీగా తరిమికొట్టవచ్చు. ఆ ప్రభావవంతమైన చిట్కాలెంటో ఓసారి చూద్దామా... 

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి

బొద్దింకలు ఎక్కువగా మురికి, తేమ ఉన్న ప్రదేశాల్లో పెరుగుతాయి. ప్రతిరోజూ వంటగది, బాత్రూమ్, భోజన ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటలకు ఉపయోగించిన పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. రాత్రిపూట తిన్న తర్వాత ఆ పాత్రలను అలా వదిలేయకూడదు. సింక్ పైపుల దగ్గర లీకేజీలను చెక్ చేసి.. లీకులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలి.

బేకింగ్ సోడా, పంచదార మిశ్రమం

సమాన పరిమాణంలో బేకింగ్ సోడా, పంచదార కలిపి ఇంటి మూలల్లో, సింక్ కింద చల్లండి. పంచదార బొద్దింకలను ఆకర్షిస్తుంది. బేకింగ్ సోడా వాటి జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల అవి చనిపోతాయి.

బోరిక్ యాసిడ్

బోరిక్ యాసిడ్ ఒక ప్రభావవంతమైన బొద్దింకల నివారిణి. దీన్ని కిచెన్, బాత్రూమ్ మూలల్లో పలుచుగా చల్లండి. చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచండి.

బొద్దింకల ఉచ్చు

పంచదార, నీరు, బేకింగ్ సోడాను కలిపి ఒక లోతైన కంటైనర్‌లో ఉంచండి. పంచదార బొద్దింకలను ఆకర్షిస్తుంది. బేకింగ్ సోడా వాటిని చంపుతుంది. ఈ ఉచ్చును బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఉంచండి.

నూనెల వాడకం

పుదీనా, యూకలిప్టస్, టీ ట్రీ ఆయిల్ వంటి నూనెలు బొద్దింకలను తరిమికొట్టడంలో సహాయపడతాయి. 10-15 చుక్కలను నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌లో నింపి, తలుపులు, కిటికీలు ఇతర మూలల్లో చల్లండి.

మూలికల వాడకం

బొద్దింకలకు కొన్ని ఆకుల ఘాటైన వాసన నచ్చదు. ఉదాహరణకు వేప ఆకులు. వీటిని మీరు ఇంట్లో ఉంచితే కీటకాలు రాకుండా నివారించవచ్చు.

ప్రవేశ స్థలాలను మూసివేయండి

బొద్దింకల ప్రవేశాన్ని నిరోధించడానికి తలుపులు, కిటికీలు, పైపులు, గోడలలోని పగుళ్లను మూసివేయండి. చెత్తను క్రమం తప్పకుండా బయట పడేయండి. మూత ఉన్న డస్ట్‌బిన్‌లను ఉపయోగించండి. ఇళ్లు శుభ్రంగా ఉంచుకోండి.