మేడ్చల్‌: టీఆర్ఎస్ ప్రభుత్వం పై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ నిప్పులు చెరిగారు. నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ పార్టీ అన్ని రంగాలను, అన్ని వ్యవస్థలను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. 

మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభకు హాజరైన కోదండరామ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో సోనియా గాంధీ ఎంతో సాహసంతో వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన సోనియాగాంధీకి కోదండరామ్ కృతజ్ఞతలు తెలిపారు.  

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా వచ్చిన యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ హాజరైన సభలో తనకు మాట్లాడే అవకాశం కలగడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై కేసీఆర్ విరుచుకుపడ్డారు కోదండరామ్. 

గత నాలుగేళ్ల పాలనలో ఎవరికీ మంచి జరిగిందని చెప్పుకోవడానికి లేదని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. నిరుద్యోగులు, విద్యార్థులు రాత్రింబవళ్లు చెట్లకింద కూర్చొని చదివినా ఉద్యోగాలు రాలేదన్నారు. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల కనీస వేతనాలు పెరగలేదని ధ్వజమెత్తారు. 

నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాలూ రాలేదని కోదండరామ్ మండిపడ్డారు. గిట్టుబాటు ధర అడిగితే రైతులకు బేడీలు వేశారని, ఇసుక మాఫియా ఆగడాలను ఆపినందుకు దళితులను నడవలేని విధంగా కొట్టారని గుర్తు చేశారు. రేషన్ డీలర్లు పడుతున్న అవస్థలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. 

అలాగే కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగులకు క్రమబద్ధీకరించలేదని ధ్వజమెత్తారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలు కూడా దక్కలేదని కోదండరామ్ విమర్శించారు. విద్యార్థులకు ఫీజు మాఫీ కాలేదని తెలిపారు. ధర్నా చౌక్‌ను మూసేశారన్నారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన చూస్తే నిరంకుశం, నియంతృత్వమే కనిపిస్తుందన్నారు. 

కేసీఆర్ నియంతృత్వ పాలన అంతం చేసే సమయం ఆసన్నమైందని కోదండరామ్ స్పష్టం చేశారు. అదృష్టవశాత్తు 9నెలల ముందే సీఎంను గద్దె దింపే అవకాశం ప్రజలకు వచ్చిందని అభిప్రాయపడ్డారు. 

కేసీఆర్‌ తనకు ఓటేసినా మంచిదే, వేయకపోయినా మంచిదే అని ఖానాపూర్ సభలో కేసీఆర్ అన్న వ్యాఖ్యలను కోదండరామ్ గుర్తు చేశారు. ఓటేసినా ఫాం హౌసే, వేయకపోయినా ఫాం హౌసే. ఎటుదిరిగి ఫాంహౌస్‌కు వెళ్లే వారికి ఓటు వేయాల్సిన అవసరం ఏముందని కోదండరామ్ నిలదీశారు. 

టీఆర్ఎస్ కు వేసిన ప్రతి ఓటూ బురదగుంటలో వేసినట్టే లెక్క అని ఆ ఓటు వృద్థా అంటూ మండిపడ్డారు. ప్రజా కూటమిని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ నిరంకుశపాలనకు సమాధి కట్టాలనే తామంతా ఒక్కటయ్యామని తెలిపారు. ప్రజాకూటమి గెలుపుతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాదు కోరుకున్న తెలంగాణ వస్తుందని ప్రతి పైసా పేదవాడికి దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందుతాయని చెప్పారు. 

డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఒక్కరికీ ఇల్లు కట్టలేదన్నారు. గట్టిగా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కోట్లాది రూపాయలు వెదజల్లుతుందని కానీ తాము వెదజల్లలేమన్నారు. 

తాము కోట్లు కొల్లగొట్టలేదని అందుకే ఓటర్లకు డబ్బులు ఇవ్వలేమన్నారు. ప్రజల కోసం నిలబడతామని వారి పక్షాన నిలబడి పనిచేస్తామని చెప్పుకొచ్చారు. మా చరిత్రే దానికి సాక్ష్యమన్నారు. జనసందోహం చూస్తుంటే సందేహమే లేదు మహాకూటమిదే ప్రభుత్వం అనిపిస్తోందని కోదండరామ్ అన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

సోనియా సంకల్పంతోనే తెలంగాణ: రాహుల్ గాంధీ

ఏళ్ల తర్వాత నా బిడ్డల వద్దకు వచ్చినట్లుంది: సోనియా

సీన్ రివర్స్: 'చేయ్యె'త్తి జైకొడుతున్న ఉద్యమ నేతలు

సెంటిమెంట్: తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి సోనియా

ఉద్యోగులకు, పేదలకు ఉత్తమ్ వరాల జల్లు

రెండు రోజుల్లో మా వైపు టీఆర్ఎస్ కీలక నేతలు: ఉత్తమ్ సంచలనం

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి: రంగంలోకి దిగిన ఆరుగురు అగ్రనేతలు