హైదరాబాద్ లో ఆదివారం రాత్రి జరిగిన శ్రీకృష్ణ రథయాత్ర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించింది. 

Hyderabad : శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు... మరికొందరు ప్రాణాపాయస్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రామంతాపూర్ ఘటనలో బాధిత కుంటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది.

రామంతాపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయి మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది ప్రభుత్వం. అలాగే గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నవారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని... వారికి మెరుగైన చికిత్స అందేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

అసలేం జరిగింది?

గత శనివారం (ఆగస్ట్ 16) హిందువుల ఆరాధ్యదైవం శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. అయితే హైదరాబాద్ లోని రామంతాపూర్ లో మాత్రం తర్వాతరోజు అంటే ఆదివారం కృష్ణాష్టమి వేడుక నిర్వహించారు. గోఖలే నగర్ ప్రాంతానికి చెందినవారంతా రథంపై శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అలంకరించి చేతులతో లాగుతూ ఊరేగింపు చేపట్టారు.

ఆటాపాటలతో తమ ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడి ఊరేగింపు చేపడుతుండగా విషాదం చోటుచేసుకుంది. రథయాత్ర మార్గంలోని యాదవ సంఘం ఫంక్షన్ హాల్ వద్ద ప్రమాదం జరిగింది. విద్యుత్ తీగలు కిందకు ఉండటం, రథం ఎత్తు ఎక్కువగా ఉండటం ప్రమాదానికి కారణమయ్యింది. విద్యుత్ తీగలను రథం పైభాగం తాకడంతో దాన్ని లాగుతున్నవారు కరెంట్ షాక్ కు గురయ్యారు. ఇలా 9 మంది విద్యుత్ షాక్ కు గురవగా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనలో కృష్ణ యాదవ్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డి మృతిచెందారు... వీరంతా 40 ఏళ్లలోపు వయసువారే. కృష్ణాష్టమి వేడుకల్లో వీరి మరణం కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఆదివారం రాత్రి 12గంటల సమయంలో జరిగింది... సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ముందుగా క్షతగాత్రులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.

రామంతాపూర్ లో ఉద్రిక్తత :

కృష్ణాష్టమి వేడుకల్లో జరిగిన విద్యుత్ ప్రమాదంతో రామంతాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఘటనాస్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన విద్యుత్‌ శాఖ సీఎండీని స్థానికులు అడ్డుకున్నారు. ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. విద్యుత్‌శాఖ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రామంతాపూర్ లో నిరసన ర్యాలీకి స్థానికులు యత్నించగా అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో స్థానికులను చెదరగొట్టారు. దీంతో పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. రామంతాపూర్‌ మెయిన్‌రోడ్‌పై స్థానికుల ధర్నా చేపట్టడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది.