హైదరాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
Hyderabad: హైదరాబాద్‌లో సొంతిల్లు ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే పెరిగిన ధరలతో చాలా మందికి ఈ కల కలగానే మిగిలిపోతోంది. కానీ మధ్య తరగతి వారికి ఊరట కలిగించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు
హైదరాబాద్ పరిసరాల్లో స్థలాలు, ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సామాన్య ప్రజలకు సొంత ఇల్లు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ‘అఫర్డబుల్ హౌసింగ్’ విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం ద్వారా భవిష్యత్ నగర విస్తరణకు స్పష్టమైన దిశ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణ–2047 విజన్‌లో గృహ నిర్మాణ ప్రణాళిక
‘తెలంగాణ–2047 విజన్’ పత్రంలో భాగంగా రాష్ట్రం మొత్తం అభివృద్ధిని మూడు ఆర్థిక జోన్‌లుగా విభజించారు. అవి CURE, PURE, RARE. ఈ జోన్‌లకు అనుగుణంగా ప్రత్యేక గృహ నిర్మాణ విధానాన్ని రూపొందిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పట్టణ విస్తరణ ప్రణాళికాబద్ధంగా జరగాలన్నదే ఈ విధానం ప్రధాన లక్ష్యంగా తెలిపారు.
ORR–RRR మధ్య ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రాబోయే రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ‘ప్యూర్’ పెరీ అర్బన్ జోన్‌ను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొత్త కాలనీలు అభివృద్ధి చేయనున్నారు. నగరానికి దగ్గరగా ఉంటూనే తక్కువ ధరలో నివాసాలు అందించడమే ప్రభుత్వ ఆలోచన.
KPHB తరహా ఆధునిక కాలనీలు
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు నమూనాలో అన్ని సౌకర్యాలతో కూడిన కాలనీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విస్తృత రోడ్లు, తాగునీటి సదుపాయం, విద్యుత్ సరఫరా, పార్కులు, పాఠశాలలు వంటి మౌలిక వసతులు సమగ్రంగా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆదాయ పరిమితులు లేకుండా ప్రతి వర్గానికి ఇళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు.
సామాన్యులకు అందుబాటులో సొంత ఇల్లు
ఈ అఫర్డబుల్ హౌసింగ్ విధానం ద్వారా మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా లాభపడనున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు క్రమబద్ధంగా అభివృద్ధి చెందే అవకాశం కలుగుతుంది. జనాభా పెరుగుదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ తరాలకు భద్రమైన నివాస వసతి కల్పించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం. మొత్తంగా గృహ నిర్మాణ రంగంలో ఇది కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని చెప్పవచ్చు.
కలిసిరానున్న మెట్రో
ఇదిలా ఉంటే అవుటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రోను విస్తరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. దీంతో కొత్తగా నిర్మించనున్న ఈ కాలనీల నుంచి నగరంలోకి వేగంగా చేరుకోవచ్చు. అదే విధంగా మేడ్చల్, శామీర్‌పేట వంటి ప్రాంతాలకు ఫ్లై ఓవర్‌ల నిర్మాణం జరుగుతోంది. ఇవి కూడా కొత్తగా ఏర్పాటు చేయనున్న కాలనీలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

