స్వ‌రాష్ట్రంగా అవ‌త‌రించిన తెలంగాణ నేడు బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ప‌రుగులు పెడుతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా సోమ‌వారం తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మ‌రో పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు.

భారీ ల‌క్ష్యం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 11 ఏళ్లు పూర్తైన సందర్భంగా సోమవారం (జూన్ 2)న సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప‌రేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన సీఎం 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యాన్ని పెట్టుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

దేశ GDPలో తెలంగాణ వాటా 10%కి పెంచాలనే లక్ష్యం

ప్రస్తుతం దేశ జిడిపీలో తెలంగాణ వాటా 5% ఉంది. దీన్ని రానున్నా రోజుల్లో 10%కి పెంచాలని సీఎం తెలిపారు. భారత్ 2047 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే, తెలంగాణ కీలక పాత్ర పోషించాల‌ని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

‘తెలంగాణ రైజింగ్ 2047’ యాక్షన్ ప్లాన్ సిద్ధం

ఈ లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ అనే దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించింది. దశలవారీగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ముందుగా $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తొలి మెట్టు అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ పార్టీలూ, అధికారులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు అందరూ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణను దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

లక్ష్యం సాకార‌మ‌వుతుందా.?

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న ప‌రిణామాలు చూస్తుంటే ల‌క్ష్యం సాకార‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే గూగుల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజంట్, హెచ్ఎస్ఎల్ వంటి టెక్ దిగ్గజాల నుంచి తెలంగాణలో ₹3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల హామీలు వచ్చాయి. వీటిలో AI సిటీ, ఫార్మా సిటీ, లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ సిటీ వంటి పెద్ద ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ఇది కూడా చదవండి: Tata altroz facelift: రూ. 13 వేల EMIతో ఈ స్ట‌న్నింగ్ కారును సొంతం చేసుకోండి.. డౌన్ పేమెంట్ ఎంతంటే

ఇండస్ట్రియల్ పాలసీలు

ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త పరిశ్రమల విధానం ద్వారా ఎంఎస్ఎంఇలు, మెగా కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించనుంది. మౌలిక వసతుల విస్తరణ, లాజిస్టిక్స్ పార్కులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. టెక్ కంపెనీలు, ఫార్మా రంగంలో భారీగా పెట్టుబడులు ప్రవేశిస్తున్నాయి. ఈ అంశాల‌న్నీ 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వస్థ‌గా తెలంగాణ‌కు అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నాయి.