హైదరాబాద్‌: సికింద్రాబాదులోని అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆరేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. తాను బాలికను నమ్మించి ఎలా తీసుకుని వెళ్లింది, ఆమె పట్లఎలా  వ్యవహరించిందీ నిందితుడు విచారణలో వివరించాడు. అతను చెప్పే విషయాలు వింటున్న పోలీసులకే దిమ్మతిరిగింది. 

హోలీ రోజు ఇంటికి సమీపంలో అన్నయ్య, స్నేహితులతో కలసి ఆడుకుంటున్న బాలికను రంగులిప్పిస్తానంటూ వెంట తీసుకెళ్లాడు. ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై రెండుసార్లు అత్యాచారం చేసి.. ఇనుప చువ్వను గొంతులో గుచ్చి చంపేశాడు. గురువారం ఆ సంఘటన జరిగింది.

ఆరేళ్ల చిన్నారిపై హత్య చేసి, ఆమెను హత్య చేసిన బిహార్‌కు చెందిన రాజేశ్‌ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జీడిమెట్లలోని డీసీపీ కార్యాలయంలో బాలానగర్‌ డీసీపీ పద్మజ ఆ కేసు వివరాలను వెల్లడించారు.
 
మెదక్‌ జిల్లాకు చెందిన దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి అల్వాల్‌లో ఉంటున్నారు. భర్త స్థానికంగా ఉన్న డెయిరీలో పనిచేస్తుండగా.. భార్య చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తోంది. వీరికి కొడుకు (7), కూతురు (6) ఉన్నారు. 

గురువారం ఉదయం భార్యాభర్తలు పనికివెళ్లారు. హోలీ పండుగ కావడంతో ఆ చిన్నారులిద్దరూ చుట్టుపక్కల ఉండే తోటి పిల్లలతో కలిసి రంగులు కొనుక్కొని సంబరాలు చేసుకుంటున్నారు. అక్కడే బిహార్‌కు చెందిన ధర్మేంద్ర అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. తన బావమరిది రోషన్‌, మిత్రులు రాజేశ్‌, సురేంద్ర, సుబ్రహ్మణ్యంలను అతను తన గదికి పిలిపించుకున్నాడు. 

అక్కడ అందరూ మద్యం తాగారు. ఈ క్రమంలో రాజేశ్‌ బయటికి వచ్చాడు. హోలీ సంబరాల్లో మునిగిపోయిన పిల్లల్లో ఆరేళ్ల చిన్నారిని గమనించాడు. మధ్యాహ్నం 3 గంటలకు ఆడుకుంటున్న పిల్లల వద్దకు రాజేశ్‌ వెళ్లాడు. బాలికను, ఆమె అన్నయ్యను దగ్గరకు పిలిచాడు. హోలీ ఆడుకోవడానికి రంగులు కొనిస్తానని చెప్పి, దుకాణానికి తీసుకెళ్లాడు. 

చిన్నారి అన్నయ్యకు రంగులు, స్నాక్స్‌ కొనిచ్చాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఆడుకోవడానికి వెళ్లిపోయాడు. చిన్నారి వద్దకు వెళ్లి తనకు కూడా రంగులు కొనిస్తానని వెంటతీసుకెళ్లాడు. ఆమెను పక్కనే ఉన్న రైల్వేట్రాక్‌ ఆవల 20 మీటర్ల దూరంలోని ముళ్లపొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు.
 
భయంతో చిన్నారి ఏడుపు లంకించుకుంది. కోపంతో తన వద్ద ఉన్న ఇనుప చువ్వతో చిన్నారి మెడపై గాయం చేశాడు. ఆ తర్వాత మరోసారి అత్యాచారానికి ఒడిగట్టాడు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందింది. దాంతో అక్కడే ముళ్లపొదల్లో పడేసి వెళ్లిపోయాడు. 

తమ చిన్నారి కనిపించకపోవడంతో రాత్రి 8 గంటలకు అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి గాలింపు సాగించారు. రాత్రి 9:30 గంటలకు పొదల్లో పాప మృతదేహాన్ని గుర్తించారు. పాప అన్నయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్‌ రెండు నెలల క్రితమే నగరానికి వచ్చాడు. ఓ టెంట్‌ హౌజ్‌లో అతడిని ధర్మేంద్రే పనికి కుదిర్చాడు.