గ‌త‌కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆదివారం తెల్ల‌వారు జామున తుది శ్వాస విడిచారు. గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ఆసుప‌త్రిలో చేరిన గోపినాథ్‌కు వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించగా ఆదివారం క‌న్నుమూశారు.

తెలంగాణ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణం రాష్ట్ర రాజకీయ వర్గాలను షాక్‌కు గురిచేసింది. ఆయన ఆదివారం ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. మాదాపూర్‌లోని తన నివాసంలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. ఆయన మరణవార్త తెలిసిన వెంట‌నే బీఆర్ఎస్‌తో పాటు ఇత‌ర పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున క‌డ‌సారి వీడ్కోలు ప‌లికేందుకు మాగంటి ఇంటికి చేరుకుంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య, జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం శ్మశానవాటికలో ఆయనకు అంతిమ గౌరవం నిర్వహించనున్నారు. ఆయన చికిత్సకు జరిగిన ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని అధికారికంగా ప్రకటించారు.

ప‌లువురి సంతాపం

మాగంటి గోపీనాథ్ మృతి పట్ల రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి మా‌గంటి సేవలను స్మరించుకుంటూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మృతి దిగ్ర్భాంతికి గురిచేసిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేశారు. 

ఇక మాగంటి గోపీనాథ్ మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘గోపీనాథ్ మరణవార్త తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని పవన్ అన్నారు. 

చంద్రబాబు స్పందన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ‘‘గోపీనాథ్‌ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీలో ప్రారంభమైంది. పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అన్నారు.

మాగంటి గోపీనాథ్‌ రాజకీయ ప్రస్థానం

మాగంటి గోపీనాథ్ మూడుసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరి 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిని ఓడించి రెండోసారి విజయం సాధించారు.

రాజకీయాల్లో చురుకునైన పాత్ర

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌ను ఓడించి హ్యాట్రిక్‌ గెలుపుతో త‌న సత్తా చాటుకున్నారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన గోపీనాథ్‌ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు.

పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బీఆర్‌ఎస్‌కి బలమైన నాయకుడిగా ఎదిగారు. తన నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ని బ‌ల‌ప‌రించేందుకు ఎంతో కృషి చేశారు. ఇలా రాజకీయాల్లో త‌న‌దైన ముద్ర వేసి గోపినాథ్ అకాల మ‌ర‌ణాన్ని ఆయ‌న‌తో సాన్నిహిత్యం ఉన్న రాజ‌కీయ నాయ‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.