కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అక్ర‌మాలు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌లు, త‌న‌ను విచార‌ణ‌కు హాజరుకావాల‌ని క‌మిష‌న్ ఆదేశించిన నేప‌థ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీష్ రావు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

తెలంగాణ‌కు కాళేశ్వరం జీవ‌ధార

కాళేశ్వ‌రం ప్రాజెక్టు తెలంగాణ జీవ‌ధార లాంటిద‌న్న హ‌రీష్ రావు.. ప్రాజెక్టుపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. శ‌నివారం ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఏర్పాటు చేసి పాయింట్ టు పాయింట్ వివ‌రించారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డే కాదని, ఇది ఒక భారీ మల్టీసిస్టమ్ ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని ముఖ్యాంశాలు

హరీష్ రావు చెప్పిన ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి. మొత్తం 141 టీఎంసీల స్టోరేజ్ సామర్థ్యంతో, 240 టీఎంసీల నీటి వినియోగ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్ట్ తెలంగాణ వ్యవసాయానికి ప్రాణవాయువుగా మారిందని హరీష్ వెల్లడించారు.

కాంగ్రెస్ హయాంలో ఏమి సాధించలేదని ఆరోపణ

కాంగ్రెస్ 2007లో ప్రాణహిత-చేవేళ్లకు శంకుస్థాపన చేసినా, 8 ఏళ్లలో కనీసం అనుమతులు కూడా పొందలేదన్నారు. కాళేశ్వరంతో అనేక చెరువులు నిండాయని, చెక్‌డ్యాంలు ఏర్పడ్డాయని, సాగునీటి విస్తీర్ణం పెరిగిందని వివరించారు.

ప్రస్తుత నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించిన హరీష్‌రావు, "గోబెల్స్ స్టైల్ అబద్ధ ప్రచారాలు మానుకోవాలి" అంటూ విమర్శించారు. కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌లు ప్రారంభించి వదిలేసే పార్టీ కాదు బీఆర్ఎస్ అన్నారు. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదనే అభిప్రాయాన్ని అసత్య ప్రచారంగా అభివర్ణించారు.

ఇదిలా ఉంటే కాళేశ్వరం వల్ల రైతులకు, సాగునీటికీ ఉపయోగం జరుగుతుందన్నది బీఆర్ఎస్ వాదన కాగా... అదే ప్రాజెక్టు వల్ల నష్టం జరిగిందని, ప్రాణహిత-చేవేళ్లను వదిలేసి తప్పు చేశారని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. ఇప్పుడు హరీష్‌రావు, కేసీఆర్ లు విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యే పరిస్థితి ఏర్పడడంతో ఈ ప్రాజెక్టుపై రాజకీయ వేడి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.