హైదరాబాద్ అనగానే ఇక్కడి ఎన్నో అద్భుత నిర్మాణాలు గుర్తొస్తాయి. చారిత్రక కట్టడాలతో పాటు ఆధునిక నిర్మాణాలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మెహిదీపట్నంలో మరో అద్భుత నిర్మాణం అందుబాటలోకి రానుంది.
హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ప్రజల సౌకర్యం, భద్రత కోసం నిర్మించిన అత్యాధునిక గ్లాస్ స్కైవాక్ అందరికీ ఆకర్షణగా మారుతోంది. దీనిని 380 మీటర్ల పొడవులో గాజు, స్టీల్‌తో నిర్మించారు. ఈ స్కైవాక్ ప్రాజెక్ట్ మెహిదీపట్నం ప్రాంతంలో రద్దీని తగ్గించడమే కాకుండా, పాదచారులకు భద్రత కల్పించనుంది.
6.15 మీటర్ల ఎత్తులో:
ఈ స్కైవాక్ భూమికి 6.15 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రజలు రోడ్డు దాటే అవసరం లేకుండా ఎలివేటర్లు, మెట్లు ద్వారా పైకి వెళ్లే అవకాశం కల్పించారు. ఈ స్కైవాక్‌కి మొత్తం 6 ప్రదేశాల నుంచి ప్రవేశం కల్పించారు. మెహిదీపట్నం రహదారి వెంబడి ముఖ్యమైన ట్రాఫిక్ జంక్షన్లకు అనుసంధానంగా ఈ స్కైవాక్ కనెక్ట్ చేస్తోంది.
13 ఎలివేటర్లు:
ఈ ప్రాజెక్టులో 13 ఎలివేటర్లు ఏర్పాటు చేశారు. వికలాంగుల కోసం ప్రత్యేక ఎలివేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్కైవాక్‌లో రెండు టన్నెల్ వాకింగ్ పాథ్‌లు ఏర్పాటు చేశారు. ఇవి వేసవిలో వేడి నుంచి, వర్షాకాలంలో వర్షం నుంచి రక్షణ కల్పిస్తాయి.
షాపింగ్ కూడా:
ఈ స్కైవాక్‌లో మొత్తం 21,061 చదరపు అడుగుల వాణిజ్య ప్రదేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కాఫీ షాప్స్,
లాంజ్‌లు, గేట్‌వే కార్నర్స్ వంటి నిర్మాణాలు ఏర్పాటు చేశారు. పాదచారులు షాపింగ్‌తోపాటు, కాపీ తాగుతూ కాల క్షేపం చేయొచ్చు.
రోజుకు 30,000 మందికి వీలుగా నిర్మాణం
ఈ స్కైవాక్‌ను రోజూ 30,000 మంది ప్రయాణికులు ఉపయోగించగలిగే విధంగా రూపొందించారు. ట్రాఫిక్ నుంచి సురక్షితంగా పాదచారులను ఉపయోగపడేలా దీనిని నిర్మిస్తున్నారు. రాత్రిపూట కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తున్నారు.