పవిత్రమైన మక్కా యాత్రకు వెళ్లిన భారతీయులు ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయిన ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. 

 సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. భారతదేశంనుండి మక్కా యాత్రకు వెళ్లినవారు ప్రయాణిస్తున్న బస్సు అర్థరాత్రి ప్రమాదానికి గురయ్యింది. మక్కా నుండి మదీనాకు వెళుతున్న బస్సు అర్ధరాత్రి 1.30 AM సమయంలో డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 42 మంది భారతీయులు మరణించినట్లు సమాచారం.

సౌదీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం... ఈ ప్రమాదంలో మరణించివారు హైదరాబాద్ కు చెందినవారిగా తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులోని ప్రయాణికులంతా నిద్రలో ఉండటంతో ఎవరూ తప్పించుకునే వీలులేకుండా పోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. యాత్రికులు మక్కా నుండి మదీనాకు వెళుతుండగా ఒక్కసారిగా బస్సు, ట్యాంకర్ ఢీకొనడంతో మంటలు ఎగిసిపడి క్షణాల్లో బస్సు దహనమైనట్లు చెబుతున్నారు.

ఇప్పటికయితే 42 మంది హైదరాబాదీలు ఈ బస్సు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది. అయితే సౌదీ అధికారులు ఈ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీంతో మృతుల సంఖ్యపై, ప్రమాదం జరిగిన విధానంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.