శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం అర్ధరాత్రి పేలుడు జరిగింది. ఇందులో చాలా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.  

Jammu Kashmir Blast : డిల్లీ బాంబ్ బ్లాస్ట్ ను మర్చిపోకముందే జమ్మూ కాశ్మీర్ లో మరో బాంబు పేలింది. జమ్మూ కాశ్మీర్‌ శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి భారీ శబ్దంతో బాంబు పేలింది. సుమారు 11:45 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులంతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.

గాయపడిన వారిని భారత సైన్యానికి చెందిన 92 బేస్ హాస్పిటల్, షేర్-ఏ-కాశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SKIMS)కు తరలించారు. సీనియర్ పోలీస్ అధికారులు నౌగామ్‌కు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పేలుడు సమాచారం అందిన వెంటనే చాలా అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. పోలీస్ స్టేషన్ లోపల, చుట్టుపక్కల చాలా నష్టం జరిగింది.

నౌగామ్ పోలీస్ స్టేషన్ చాలా కీలకం

కాశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న అంతర్రాష్ట్ర టెర్రర్ మాడ్యూల్ కేసుకు సంబంధించిన మొదటి ఎఫ్ఐఆర్ ఇక్కడే నమోదైంది. అందుకే ఈ పేలుడును దర్యాప్తుకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి చేసిన కుట్రగా చూస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Scroll to load tweet…

పేలుడు పదార్థాల నుంచి నమూనాలు తీస్తుండగా పేలుడు

ఓ నివేదికల ప్రకారం, పోలీస్ అధికారులు, ఒక ఎఫ్ఎస్ఎల్ బృందం ప్రాంగణంలో తనిఖీలు చేస్తుండగా ఈ పేలుడు జరిగింది. ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్‌లో 'వైట్‌కాలర్' టెర్రర్ మాడ్యూల్ కేసులో స్వాధీనం చేసుకున్న అమ్మోనియం నైట్రేట్ పెద్ద నిల్వ నుంచి అధికారులు నమూనాలు సేకరిస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రాంగణంలో ఉన్న చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే చాలా ఫైర్ ఇంజన్లు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లే అన్ని దారులను మూసివేశారు.

 నౌగామ్ పోలీస్ స్టేషన్ ఆ ప్రాంతంలోని వివిధ ప్రదేశాలలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ పోస్టర్లను అతికించిన కేసును ఛేదించింది. ఈ పోస్టర్లు రాడికల్ డాక్టర్లు ఉన్న టెర్రర్ మాడ్యూల్‌ను బట్టబయలు చేశాయి. ఈ దర్యాప్తు తర్వాత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు, చాలా మంది ఉగ్రవాద డాక్టర్లను అరెస్టు చేశారు.