Train Accident : ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్ పూర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. రైల్వే ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది.
Chhattisgarh Bilaspur Train Accident : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ సమీపంలో సోమవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగింది. గెవ్రా రోడ్ నుండి బిలాస్ పూర్ వైపు వస్తున్న MEMU లోకల్ రైలు గూడ్స్ రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం సాయంత్రం 4 గంటల సమయంలో గటోరా, బిలాస్ పూర్ స్టేషన్ల మధ్య జరిగింది. బలంగా ఢీ కొట్టడంతో ప్రయాణికుల రైలు మొదటి బోగీ గూడ్స్ రైలుపైకి ఎక్కింది.
రక్షణ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) అధికారులు తక్షణమే స్పందించి రక్షణ బృందాలను ఘటనాస్థలికి పంపారు. రైలులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. గాయపడినవారికి ప్రాథమిక చికిత్స అందించడం, సమీప ఆస్పత్రులకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీములు పని చేస్తున్నాయని అధికారులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఈ రైల్వే మార్గం నిలిచిపోయింది. అనేక రైళ్లను రద్దు చేయగా, కొన్నింటిని దారి మళ్లించారు.
హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసిన రైల్వే
ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకునేందుకు రైల్వే ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. అవి..
• చంపా జంక్షన్: 8085956528
• రాయగఢ్: 9752485600
• పెంద్రా రోడ్: 8294730162
• ప్రమాద స్థలం: 9752485499, 8602007202
• బిలాస్ పూర్ : 7777857335, 7869953330
• కొర్బా: 7869953330
ప్రయాణికుల కుటుంబాలకు సమాచారం ఇవ్వడానికి ఈ హెల్ప్‌లైన్‌లు 24 గంటలు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
సిగ్నల్ వైఫల్యంతోనే ప్రమాదం జరిగిందా?
ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సిగ్నల్ లోపం, మానవ తప్పిదం లేదా యాంత్రిక లోపం కారణమా అనే దానిపై రైల్వే విభాగం విచారణ చేస్తోంది. సీనియర్ రైల్వే అధికారులు ఘటన స్థలంలో పర్యవేక్షణ చేస్తున్నారు.
దక్షిణ తూర్పు మధ్య రైల్వే అధికారుల ప్రకారం.. “ప్రమాదం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. MEMU రైలులోని మొదటి బోగీ గూడ్స్ రైలుపై ఎక్కి తీవ్ర నష్టం జరిగింది. గాయపడిన వారందరికీ తగిన వైద్యం అందిస్తున్నారు” అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
ఈ ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ స్పందించింది. రైల్వే మంత్రి బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ₹10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ₹5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹1 లక్ష సాయం అందిస్తామని తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఎక్స్ పోస్టులో, “బిలాస్ పూర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదం చాలా బాధాకరం. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి రక్షణ చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించాను. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయం అందిస్తుంది” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం పోలీసులు, ఆర్‌పీఎఫ్ బృందాలు ఘటనాస్థలాన్ని సీజ్ చేసి రక్షణ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. లొకో పైలట్ పరిస్థితి విషమంగా ఉందనీ, చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
