తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన విమర్శలకు సమాధానంగా, ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని తెరపైకి తెచ్చారు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. 

"కూలేశ్వరం" విమర్శలకు కౌంటర్

మేడిగడ్డ బ్యారేజీ వద్ద రెండు పిల్లర్లు దెబ్బతిన్న వెంటనే కాంగ్రెస్, బీజేపీ నేతలు ‘కూలేశ్వరం’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యామ్ రెండోసారి కొట్టుకుపోయిన సందర్భంలో అదే ధైర్యం చూపించి ‘కూలవరం’ అని ఎందుకు చెప్పలేదని ఆయన నిలదీశారు.

ఎన్డీఎస్ఏ పక్షపాతం?

కాళేశ్వరం వద్ద చిన్న సమస్య తలెత్తగానే 24 గంటల్లోపే జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (NDSA) జోక్యం చేసుకుని బీఆర్‌ఎస్‌పై బురదజల్లిందని కేటీఆర్ ఆరోపించారు. కానీ పోలవరం కాఫర్ డ్యామ్ వరుసగా రెండోసారి విఫలమైనా, కేంద్ర సంస్థలు ఎందుకు మౌనం వహిస్తున్నాయో వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

పోలవరంలో మరమ్మతులు గుట్టుచప్పుడు కాకుండా?

ఆంధ్రప్రదేశ్‌లో 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతులో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయినా, కేంద్రం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ తెలంగాణలో 20 నెలలుగా మేడిగడ్డ సమస్యకు కనీస పరిష్కారం చూపడం లేదని విమర్శించారు.

2020లో పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ఘటన, అలాగే తెలంగాణలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయినా ఎన్డీఎస్ఏ మౌనంగా ఉన్న ఉదంతాలను కేటీఆర్ ప్రస్తావించారు. ఇది కేవలం ఇంజినీరింగ్ సమస్య కాకుండా రాజకీయ కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు.

కాళేశ్వరం రైతాంగానికి ప్రాణాధారం

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతులకు జీవనాధారం అని, దానిపై కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ కృషితో నిర్మితమైన ఈ ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.