తెలంగాణ ప్రజలు 100 రూపాయలతో విజయవాడ వెళ్లొచ్చు.. ఎలాగో తెలుసా.?
Free Bus Scheme: ఎక్కువ మంది రాకపోకలు సాగించే మార్గాల్లో హైదరాబాద్-విజయవాడ ఒకటి. ప్రతీ రోజూ వేలాది మంది ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ మొదలు ప్రైవేట్ వాహనాల వరకు వేలాది సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి.

రెండు రాష్ట్రాలుగా విడిపోయినా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు భౌగోళికంగా విడిపోయినా.. చాలా మంది ఏపీ ప్రజలు తెలంగాణలోనే నివసిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య దృష్ట్యా హైదరాబాద్‌లో నివిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా విజయవాడతో పాటు చుట్టుపక్కాల ప్రాంతాల వారు ఎక్కువగా జీవనం సాగిస్తున్నారు.
భారీగా రాకపోకలు
దీంతో హైదరాబాద్, విజయవాడల మధ్య ప్రతీరోజూ వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు అయితే ఏకంగా ప్రతీ రోజూ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు కూడా. సహజంగా అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్ టికెట్ కనీసం రూ. 600 నుంచి మొదలవుతుంది. అదే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఏకంగా రూ. 1000 వరకు ఉంటాయి. ఇక వనస్థలిపురం నుంచి ప్రాంతాల నుంచి కార్లు ఏకంగా రూ. 1500 వరకు వసూలు చేస్తున్నాయి.
100 రూపాయలతో ఎలా వెళ్లొచ్చు..?
అయితే తెలంగాణకు చెందిన మహిళలకు విజయవాడకు కేవలం రూ. 100 లోపే వెళ్లే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఏపీ ప్రభుత్వం సైతం తాజాగా ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ఉపయోగించుకుంటే అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే మహిళలు, ఇటు తెలంగాణ నుంచి విజయవాడ వెళ్లే మహిళలు కేవలం రూ. 100 రూపాయల్లోనే వెళ్లొచ్చు.
ఎలాగంటే.?
తెలంగాణ నుంచి విజయవాడ వెళ్లే మహిళలు తెలంగాణ ఆర్టీసీ బస్సు ఎక్కాల్సి ఉంటుంది. అయితే ఉచిత బస్సు పథకం అమల్లో ఉండే ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో వెళ్తేనే ఇది సాధ్యం. తెలంగాణ బార్డర్ అయిన కోదాడ వరకు ఉచిత టికెట్ వర్తిస్తుంది. అక్కడి నుంచి విజయవాడకు ఎక్స్‌ప్రెస్ ఛార్జ్ రూ. 100లోపే ఉంటుంది. ఇలా తక్కువ ఛార్జ్‌తోనే విజయవాడ వెళ్లొచ్చు.
తెలంగాణలో ఎక్కడున్నా.?
కేవలం హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు కేవలం రూ. 100లోపే వెళ్లొచ్చు. ఉదాహరణకు కామారెడ్డి నుంచి ఒక మహిళ విజయవాడ వెళ్లాలని అనుకుందాం. ఇలాంటి వారు కామారెడ్డి నుంచి సిద్ధిపేట వరకు ఎక్స్‌ప్రెస్ బస్సులో ఉచితంగా వెళ్లొచ్చు. అక్కడి నుంచి జనగామ వరకు అక్కడి నుంచి సూర్యపేట వరకు ఉచితంగా వెళ్లొచ్చు. సూర్యపేట నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కితే కోదాడ వరకు ఫ్రీ టికెట్‌తో ప్రయాణించవచ్చు. అక్కడి నుంచి టికెట్ తీసుకుంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే మహిళలకు కూడా ఇదే వర్తిస్తుంది. అయితే ఇది కాస్త సమయం, శ్రమతో కూడుకున్న అంశమే అయినా డబ్బులు మాత్రం ఆదా అవుతాయి.