Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
Telangana second phase panchayat elections: తెలంగాణ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 85.86 శాతం పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. చాలా ప్రాంతాల్లో బీఆర్ఆఎస్ గట్టి పోటీని ఇచ్చింది.

85.86% పోలింగ్.. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు
తెలంగాణలో గ్రామీణ రాజకీయాలకు కీలకమైన రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ విడతలో మొత్తం 85.86 శాతం పోలింగ్ నమోదైంది. అర్హులైన ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొనడం ద్వారా ప్రజాస్వామ్యంపై తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ ముగియడం విశేషంగా నిలిచింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ దూకుడు కనిపించింది.
పోలింగ్ శాతం, ఓటర్ల భాగస్వామ్యం
రెండో దశలో మొత్తం 54,40,339 మంది అర్హులైన ఓటర్లు ఉండగా, వారిలో 46,70,972 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్ నమోదవగా, ఉదయం 11 గంటల నాటికి అది 56.71 శాతానికి చేరుకుంది. చివరకు 85.86 శాతం పోలింగ్ నమోదవడం గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ చైతన్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. అదనపు డీజీపీ మహేష్ ఎం భగవత్ మాట్లాడుతూ, పోలింగ్ పూర్తిగా ప్రశాంతంగా జరిగిందని వెల్లడించారు.
కాంగ్రెస్ దే పై చేయి
ఈ విడతలో 3,911 గ్రామ పంచాయతీలు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు పోటీ చేయగా, వార్డు సభ్యుల స్థానాలకు 71,071 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
సాయంత్రం 7:30 గంటల వరకు వచ్చిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 1500కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 800కు పైగా, బీజేపీ సుమారు 190, ఇతరులు 440కు పైగా స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. 2197 స్థానాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. 1163 బీఆర్ఎస్, 254 బీజేపీ, 615 స్థానాల్లో ఇతరులు గెలిచారు.
రెండు దశల్లో కలిపి కాంగ్రెస్ దే పై చేయి
డిసెంబర్ 11న జరిగిన తొలి విడతలో 84.28 శాతం పోలింగ్ నమోదైంది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించగా, రెండో దశ కూడా విజయవంతంగా పూర్తైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో, ఈ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజాదరణ పరీక్షగా మారాయి. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై జరిగిన రాజకీయ చర్చలు ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. చట్టపరమైన అడ్డంకుల కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది. రెండు దశల్లోనూ కాంగ్రెస్ దూకుడు కనిపించింది.
కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం ఎప్పుడు?
ఎన్నికల మొత్తం ప్రక్రియ డిసెంబర్ 17 నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 20న కొత్తగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం జరగనుంది. 2019లో ఎన్నికైన పాలకవర్గాల పదవీకాలం పూర్తయ్యాక ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ఎన్నికలు గ్రామీణ పాలనకు కొత్త ఊపునిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం ప్రజలు ప్రభుత్వ పాలనపై పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గ్రామస్థాయి వరకు సమన్వయంతో ప్రచారం నిర్వహించిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న ప్రజాపాలన, సంక్షేమ అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు. సామాజిక న్యాయానికి ప్రజల తీర్పు సపోర్టుగా నిలిచిందని, గ్రామీణ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

