- Home
- Telangana
- IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Weather Updates : ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి… దీంతో చలి గజగజా వణికిస్తోంది. హైదరాబాద్ వెదర్ సెంటర్ హెచ్చరికల ప్రకారం… ఈ చలి ఎప్పుడు తగ్గే అవకాశాలున్నాయో తెలుసాా?

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి... దీంతో చలి చంపేస్తోంది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంది... ఇక్కడ సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. గత వారంరోజులుగా చలి మరీ ఎక్కువగా ఉంది.. మరో రెండ్రోజులు (డిసెంబర్ 15, 16న) చలిగాలులు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావణ కేంద్రం తెలిపింది.
ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్
రాబోయే రెండు రోజుల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీ సెల్సియస్ తక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 5 నుండి 10 డిగ్రీ సెల్సియస్ లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. ఇక మిగతా కొన్ని జిల్లాల్లో 11 నుండి 15, అంతకంటే ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే...
ప్రస్తుతం తెలంగాణలో అత్యల్పంగా ఆదిలాబాద్ లో 6.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మెదక్ లో 8.8, రామగుండంలో 11.8, హన్మకొండలో 12, నిజామాబాద్ లో 12.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఇలా చాలాప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరిగింది.
హైదరాబాద్ లో పడిపోయిన టెంపరేచర్స్
హైదరాబాద్ లో కూడా ఊహించని స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నగర శివారులోని పటాన్ చెరులో అత్యల్పంగా 9 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. రాజేంద్రనగర్ లో 10, బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద 12.4, హయత్ నగర్ లో 12.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలో కంటే శివారుప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటోంది.
తెలుగు ప్రజలారా... తస్మాత్ జాగ్రత్త
ప్రస్తుతం చలి చంపేస్తుండటంతో ప్రజలు సాయంత్రం అయ్యిందంటే చాలు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం వాకింగ్, జాగింగ్ చేసేవారు, స్కూళ్ళకు వెళ్లే విద్యార్ధులు, ఆపీసులకు వెళ్లేవారు గజగజా వణికిస్తున్న చలికి ఇబ్బంది పడుతున్నారు. శీతాకాలం ఆరంభంలోనే పరిస్థితి ఇలావుంటే రాబోయేరోజుల్లో చలి ఏ స్థాయిలో ఉంటుందోనని కంగారుపడుతున్నారు.
ఏపీపై చలి పంజా
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోతున్నాయి... ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గడ్డకట్టే స్థాయిలో చలి ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో అత్యల్పంగా 4.4 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక డుంబ్రిగూడలో 5.1, జి. మాడుగులలో 5.5, ముంచంగిపుట్టులో 6, హుకుంపేటలో 7.3, చింతపల్లిలో 7.5, పాడేరులో 8.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ చలికి విపరీతమైన పొగమంచు కూడా తోడవుతోంది... దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

