తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలు 2025 కోసం హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఈ పోటీలు ఈనెల 7 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఈవెంట్ సౌందర్యం, భద్రత, సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది.
ఈ క్రమంలోనే లండన్‌కు చెందిన మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్, సీఈవో జూలియా ఈవేలిన్ మోర్లీ శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమెకు తెలంగాణ అధికారులు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. మీడియాతో మాట్లాడిన ఆమె, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ పోటీలు రాష్ట్ర వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయనున్నాయని చెప్పారు.
ఈ పోటీలకు 120 దేశాలకు పైగా సుందరీమణులు హాజరుకానున్నారు. ఇప్పటివరకు 116 దేశాల నుంచి అధికారిక నమోదు పూర్తయింది. పోటీదారుల రాక శుక్రవారం నుంచే ప్రారంభమైంది. ఈ నెల 10న గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభ వేడుక జరుగనుంది.
మిస్ వరల్డ్ పోటీదారులు రాష్ట్రంలోని అనేక చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించనున్నారు. వీటిలో ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీ, బుద్ధవనం, రామప్ప దేవాలయం, వరంగల్ వేయి స్తంభాలగుడి, యాదాద్రి ఆలయం, ఓరుగల్లు కోట, పొచంపల్లి, పిల్లలమర్రి, చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్, శిల్పకళావేదిక, గచ్చిబౌలి స్టేడియం, హైటెక్స్ వంటివి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని అన్ని ఏర్పాట్లను జూలియా మోర్లీ స్వయంగా పర్యవేక్షించనున్నారు.
వేసవి తీవ్రత దృష్ట్యా, కార్యక్రమాలు ఎక్కువగా సాయంత్రం 4.30 తర్వాత జరగేలా షెడ్యూల్ రూపొందించారు. ఇండోర్ ఈవెంట్లు మాత్రమే ఉదయం జరుగుతాయి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేపట్టారు.
భద్రతపై ప్రత్యేక దృష్టి – డీజీపీ జితేందర్
డీజీపీ డా. జితేందర్ శుక్రవారం నిర్వహించిన సమీక్షలో, మిస్ వరల్డ్ పోటీల భద్రతపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పోటీదారులు సందర్శించే ప్రాంతాల్లో సురక్షిత వాతావరణం కల్పించాలని సూచించారు. సమీక్షలో అదనపు డీజీపీలు మహేశ్ భగవత్, నాగిరెడ్డి, పోలీసు నోడల్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.
