ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులు ప్రారంభం కావడంతో దేశం దృష్టి ఒక్కసారిగా అటు పడింది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 11 ఏళ్లు గడుస్తోన్నా రాజధాని లేదనే వెలితి ఏపీ ప్రజలను వెంటాడుతూనే ఉంది. అయితే ఆ వెలితిని పూర్తి చేయడానికి చంద్రబాబు సర్కారు కీలక అడుగు వేసింది. ఇకపై వెనక్కి తగ్గేదేలే అన్నట్లు అమరావతి నిర్మాణంలో వేగాన్ని పెంచింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃనిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో రాజధానిని నిర్మించి తీరుతామని తెలిపారు. ప్రధాని మోదీ సైతం తనవంతు సాయం చేస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబుపై తనకు పూర్తి నమ్మకం ఉందని మూడేళ్లలో అమరావతి నిర్మించి తీరుతారని చెప్పుకొచ్చారు. ఇందుకోసం తన భుజాన్ని కూడా అందిస్తానని మోదీ చెప్పుకొచ్చారు.
రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్ని పనులూ ఏకకాలంలో చేపట్టేలా రూ.77,250 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం. రూ.49,000 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. ఇక శుక్రవారం మోదీ సైతం పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉంటే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం కీలక ఒప్పందం చేసుకుంది. ఐబీఎమ్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీలతో చంద్రబాబు ఎంఓయు కుదుర్చుకున్నారు. 2026 జనవరి నాటికి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఇదిలా ఉంటే భారీ అంచనాలు, భారీ ప్రకటనలతో నిర్మించ తలపెట్టిన అమరావతి నగరం మూడేళ్లలో పూర్తి అవుతుందని కూటమి ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోన్న తరుణంలో.. కొన్ని నెగిటివ్ వాదనలు సైతం వినిపిస్తున్నాయి. మూడేళ్లలో రాజధాని నిర్మాణం అసాధ్యమంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే నిజంగానే మూడేళ్ల సమయంలో ఒక నగరాన్ని నిర్మించడం సాధ్యమేనా.? అసలు చరిత్ర ఏం చెబుతోంది.? గతంలో తక్కువ వ్యవధిలో ఏవైనా నగరాలు నిర్మాణం జరుపుకున్నాయా.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రసీలియా నగరం 3.5 ఏళ్లలో పూర్తయింది
బ్రసీలియా బ్రెజిల్ దేశ రాజధాని నగరం. ఇది అత్యాధునిక ప్లానింగ్‌తో నిర్మించిన నగరంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ నగర నిర్మాణం 1956లో మొదలు కాగా కేవలం 41 నెలలలో అంటే 3.5 ఏళ్లలో పూర్తయింది. ఏప్రిల్ 21, 1960 నాటికి రాజధానిగా అందుబాటులోకి వచ్చింది.
బ్రెజిల్ దేశ అభివృద్ధిని ఆగ్నేయ తీరప్రాంతం నుంచి దేశ మధ్యభాగానికి విస్తరించే ఉద్దేశంతో ఈ నగరాన్ని నిర్మించారు. బ్రసీలియా నగర ఆకృతి ఒక విమానం ఆకారంలో ఉంటుంది. దీనిని UNESCO ప్రపంచ వారసత్వ నగరంగా 1987లో గుర్తించింది.
నైపిడా (మయన్మార్):
మయన్మార్ రాజధానిగా నైపిడాను నవంబర్ 6, 2005లో ప్రకటించారు. ఈ నగర నిర్మాణం 2002లో మొదలైంది. అంటే కేవలం మూడేళ్లలో పూర్తయింది. మయన్మార్ రాజధానిని వాయవ్య ప్రాంతంలోని యాంగోన్ నుంచి దేశ మధ్యభాగానికి తరలించాలనే ఉద్దేశంతో ఈ నగరాన్ని నిర్మించారు "నైపిడా అంటే "రాజధాని స్థలం" లేదా "రాజధాని నివాస స్థలం అని అర్థం. ఈ నగరాన్ని పరిపాలన జోన్, రెసిడెన్షియల్ జోన్, మిలటరీ జోన్, హోటళ్ల జోన్‌లుగా విభజించారు.
ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణం కలిగిన రాజధానుల్లో ఇదీ ఒకటి. నగరంలోని రోడ్లు చాలా వెడల్పుగా ఉండేలా నిర్మించారు. అయితే ఈ నగరంలో జనాభా ఆశించిన స్థాయిలో లేదని చెప్పాలి. ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంటు భవనం వంటి వాటిని పూర్తిగా నైపిడాకు తరలించారు.
పుత్రజయా (మలేషియా)
మలేషియాలోని పుత్రజయా నగరాన్ని పరిపాలనా కేంద్రంగా నిర్మించారు. కౌలాలంపూర్‌కు ప్రత్యామ్నాయంగా ఈ నగరాన్ని నిర్మించారు, కానీ రాజధాని హోదా మాత్రం కౌలాలంపూర్‌దే కొనసాగుతోంది. ఈ నగర నిర్మాణాన్ని 1995లో మొదలు పెట్టగా మొదటి దశ 1999లో పూర్తయింది. మొదట ప్రభుత్వ కార్యాలయాలను తరలించారు.
మలేషియాలోని ప్రధాన నగరమైన కౌలాలంపూర్ పట్టణ భారం తగ్గించడానికి, ప్రభుత్వ కార్యాలయాలను ప్రత్యేక నగరంలో సమీకరించేందుకు ఈ నగరాన్ని అభివృద్ధి చేశారు. దీనిని గ్రీన్ సిటీగా నిర్మించారు. నగరంలో 70% వరకు పచ్చదనం, పార్కులు, సరస్సులు ఉన్నాయి. ఈ నగరం పూర్తిగా అభివృద్ధి చెందడానికి 10–15 ఏళ్లు పట్టింది.


