Asianet News TeluguAsianet News Telugu

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: అభ్యర్థుల్లో రెబెల్స్ వణుకు

: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని  పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబెల్స్ బెడద తలనొప్పిగా మారింది. తమకు టికెట్టు రాకపోగా ప్రత్యర్థికి టికెట్టు దక్కడంతో పార్టీ నాయకత్వం బుజ్జగించినా కూడ పట్టించుకోకుండా రెబెల్స్ గా బరిలోకి దిగారు

here is rebel candidates in key parties in adilabad district
Author
Hyderabad, First Published Dec 1, 2018, 3:00 PM IST


ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని  పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబెల్స్ బెడద తలనొప్పిగా మారింది. తమకు టికెట్టు రాకపోగా ప్రత్యర్థికి టికెట్టు దక్కడంతో పార్టీ నాయకత్వం బుజ్జగించినా కూడ పట్టించుకోకుండా రెబెల్స్ గా బరిలోకి దిగారు.  రెబెల్స్ చీల్చే ఓట్లు ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది. అయితే రెబెల్స్  మాత్రం పోటీకి తమ సత్తాను నిరూపించుకొనేందుకు  సిద్దమయ్యారు.

జిల్లాలోని బోథ్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్  బెడద  ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు  కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే  కాంగ్రెస్ పార్టీ నుండి  అనిల్ జాదవ్, కుమ్రం కోటేశ్వర్ రావులు కూడ  టికెట్టు ఆశించారు. 

కానీ బాపూరావుకు  కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం టికెట్టు కేటాయించింది. అనిల్‌జాద‌వ్ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా, కోటేశ్వర్ నేష‌న‌లిస్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేష‌న్లు వేశారు. వారిద్దరూ కూడ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. రెబెల్స్‌గా బరిలో ఉన్నారు. మరో వైపు టీఆర్ఎస్‌లో కూడ ఎంపీ నగేష్ వర్గం కూడ టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపూరావుకు సహకరించడం లేదని బాపురావు వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు.

ముథోల్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్టు కోసం మాజీ ఎమ్మెల్యే నారాయణరావు  పటేల్ చివరి నిమిషం వరకు ప్రయత్నించారు.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రామారావు పటేల్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఇచ్చింది.  దీంతో  నారాయణరావు పటేల్ ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.నారాయణరావు పటేల్  కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు చెందని అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకొంటున్నారు. ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన విఠల్ రెడ్డికి టీఆర్ఎస్ క్యాడర్ పూర్తిస్థాయిలో సహకరించడం లేదు.

ఖానాపూర్ అసెంబ్లీ స్థానంలో  టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన రమేష్ రాథోడ్‌కు  కాంగ్రెస్ పార్టీ టికెట్టు కేటాయించింది. ఖానాపూర్ నుండి  2009లో  రమేష్ రాథోడ్ సతీమణి  సుమన్ రాథోడ్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.  రమేష్ రాథోడ్ కు టికెట్టు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఆశించిన హరినాయక్ రెబెల్‌గా బరిలో నిలిచారు. గతంలో రెండు దఫాలు హరినాయక్  ఈ స్థానం నుండి పోటీచేసి ఓటమి పాలయ్యారు. రెండు సార్లు ఓటమి పాలైన  సానుభూతి తనకు కలిసివస్తోందనే ధీమాతో హరినాయక్ ఉన్నారు.

 మంచిర్యాల నుండి పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్టు దక్కకపోవడంతో అరవింద్ రెడ్డి  టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికలకు ముందు అరవింద్ రెడ్డి  టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో అరవింద్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఈ దఫా కాంగ్రెస్ టికెట్టు  ప్రేమ్ సాగర్ రావుకు దక్కడంతో  అరవింద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. మంచిర్యాల ఎంపీపీ బేర సత్యనారాయణ  తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ప్రస్తుత అభ్యర్థి దివాకర్ రావు  అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో  ఆయన రెబెల్‌గా బరిలో నిలిచారు.మ‌హిళా నేత చ‌ల్లగుల్ల విజ‌య‌శ్రీ సైతం దివాక‌ర్‌రావు ఓట‌మే ల‌క్ష్యంగా ఇండిపెండెంట్‌గా బ‌రిలో నిలిచారు.తమకు ఓటేయకున్నా ఫర్వాలేదు కానీ దివాకర్ రావుకు ఓటేయ్యకూడదని  ప్రచారం నిర్వహిస్తున్నారు.

చెన్పూరులో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టీఆర్ఎస్ టికెట్టు దక్కలేదు. దీంతో ఓదేలు అనుచరులు  చెల్లాచెదురయ్యారు. మాజీ మంత్రి బోడ జనార్ధన్ కాంగ్రెస్ టికెట్టు ఆశించారు.కానీ, ఆయనకు కాకుండా వెంకటేశ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్టు కేటాయించింది. దీంతో బోడ జనార్ధన్  బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను తన వైపుకు తిప్పుకొనేందుకు టీఆర్ఎస్ నేత బాల్క సుమన్  ప్రచారం చేస్తున్నారు.

చెన్నూరు టీఆర్ఎస్ టికెట్టు ఆశించిన మాజీ మంత్రి వినోద్ కు కేసీఆర్ మొండి చేయి చూపారు. దీంతో బెల్లంపల్లి నుండి  వినోద్  బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.టీఆర్ఎస్ లోని ఓ వర్గం నేతలు వినోద్ పట్టుబట్టి బెల్లంపల్లికి తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. ఈ పరిణామం టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు తలనొప్పిగా మారింది. ప్రజా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటులో భాగంగా బెల్లంపల్లి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సీపీఐకు కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజారిటీ నేతలు వినోద్ కు మద్దతుగా నిలిచారు. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి వినోద్ కు మద్దతు పలికారు. మున్సిఫల్ మాజీ ఛైర్మెన్ సూరిబాబు వినోద్‌కు బాసటగా నిలిచారు.

సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్టు ఆశించిన రావి శ్రీనివాస్  బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీడీపీ నుండి రేవంత్ రెడ్డితో పాటు రావి శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరారు. అయితే పాల్వాయ్ హరీష్ బాబుకు టికెట్టు దక్కడంతో  రావి శ్రీనివాస్ రెబెల్ గా బరిలో నిలిచారు. ఆసిఫాబాద్  స్థానంలో కాంగ్రెస్ పార్టీ  ఆత్రం సక్కును బరిలోకి దింపింది. అయితే ఈ స్థానంలో టీజేఎస్ కూడ బరిలోకి దింపింది. కూటమిలోని రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొంది.  

సంబంధిత వార్తలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఈ 12 సీట్లలో టగ్ ఆఫ్ వార్

ఆసక్తికరం: జనాభాలో తక్కువే, పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ

వారసులు: తండ్రుల బాటలో ఆదిలాబాద్ నేతలు

నర్సంపేట: మద్దికాయల ఓంకార్‌ రికార్డ్ ఇదీ

ఇల్లెందు: డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

హేమాహేమీల అడ్డా: ఆ ప్రముఖులు ఇక్కడివారే

కారణమిదే: ఆ స్థానంలో ఇంతవరకు టీడీపీ గెలవలేదు

Follow Us:
Download App:
  • android
  • ios