మునుగోడు: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇంతవరకు టీడీపీ విజయం సాధించలేదు. టీడీపీతో వామపక్షాలు మిత్రపక్షాలుగా ఉన్న కాలంలో ఈ స్థానాన్ని సీపీఐకి టీడీపీ కేటాయించింది. దీంతో ఎక్కువకాలం టీడీపీ క్యాడర్ సీపీఐకు ఓటేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా కూడ ఈ స్థానం నుండి విజయం దక్కలేదు.

1983 ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా గాలి జంగయ్య పోటీ చేశారు. కానీ, ఆయన మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రెండో స్థానంలో సీపీఐ నిలిచింది.

1985లో ఎన్టీఆర్ తో వామపక్షాలు మిత్రపక్షాలుగా కలిసి పోటీ చేశాయి. నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ సమయంలో ఎన్టీఆర్ కు వామపక్షాలు, బీజేపీ తోడుగా నిలిచాయి. దీంతో 1983లో ఎన్టీఆర్ తో వామపక్షాలు లేవు. 1985 ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు టీడీపీతో కలిసి కూటమిగా పోటీ చేశాయి.

1985లో మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకు  టీడీపీ కేటాయించింది.1985లో సీపీఐ అభ్యర్థిగా ఉజ్జిని నారాయణరావు పోటీ చేసి విజయం సాధించారు. 1989, 1994 ఎన్నికల్లో కూడ టీడీపీ మద్దతుతో సీపీఐ అభ్యర్ధిగా ఉజ్జిని నారాయణరావు పోటీ చేసి విజయం సాధించారు.  ఈ స్థానాన్ని తమకు కేటాయించాలని పలు దఫాలు టీడీపీ కోరింది. కానీ, ఈ స్థానాన్ని సీపీఐ వదిలిపెట్టలేదు.

1999 ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో జట్టు కట్టింది. దీంతో వామపక్షాలు ఒంటరిగా పోటీ చేశాయి. మునుగోడు నుండి టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఆ సమయంలో టీడీపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన జెల్లా మార్కండేయులును టీడీపీ బరిలోకి దించింది. ఆ ఎన్నికల్లో  జెల్లా మార్కండేయులుకు 41,095 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విజయం సాధించారు.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ లు కూటమిగా పోటీ చేశాయి. ఈ స్థానం నుండి సీపీఐ అభ్యర్థిగా పల్లా వెంకట్ రెడ్డి పోటీ చేయగా, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థిగా చిలువేరు కాశీనాథ్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాశీనాథ్ కు 43,967 ఓట్లు వచ్చాయి.

2009 ఎన్నికల సమయంలో  సీపీఐ, టీడీపీ, సీపీఎం, టీఆర్ఎస్ లు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో  సీపీఐ అభ్యర్థిగా ఉజ్జిని యాదగిరిరావు పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఈ స్థానం నుండి టీడీపీ ఇంతవరకు విజయం సాధించలేదు.

2018 ఎన్నికల్లో పీపుల్స్ ఫ్రంట్ తరపున  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.