హైదరాబాద్: 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో  12 చోట్ల అభ్యర్థులు అతి స్వల్ప మెజారిటీతో  విజయం సాధించారు. ఈ దఫా పరిస్థితి ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.  గత ఎన్నికల నాటికి ప్రస్తుత ఎన్నికల నాటికి  రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి. అయితే  ఈ పరిణామాలు ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే  విషయమై ఆసక్తికర చర్చ సాగుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో  ప్రస్తుతం  టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు గాను  టీడీపీ, టీజేఎస్, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు ప్రజా కూటమిగా ఏర్పడ్డాయి. టీఆర్ఎస్‌‌ను గద్దె దించేందుకు గాను  ఈ నాలుగు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.  2014 ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీలు కూటమిగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేశాయి. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత విపక్ష పార్టీలకు చెందిన  ఎమ్మెల్యేలు,  నేతలు టీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో సాధారణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్.... అసెంబ్లీ రద్దు చేసే నాటికి విపక్షాల ఉనికే ప్రశ్నార్థకంగా చేసింది.దీంతో టీఆర్ఎస్‌కు బుద్ది చెప్పేందుకుగాను  పీపుల్స్ ఫ్రంట్ గా టీడీపీ, టీజేఎస్, కాంగ్రెస్,  సీపీఐ ఏర్పడ్డాయి.

గత ఎన్నికల్లో  వెయ్యి ఓట్ల లోపు మెజారిటీతో ముగ్గురు, మూడువేల లోపు మెజారిటీతో ఆరుగురు. నాలుగు వేల మెజార్టీతో ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించారు.  టీఆర్ఎస్ నుండి ఏడుగురు అభ్యర్థులు, కాంగ్రెస్ నుండి ముగ్గురు.  టీడీపీ నుండి ఇద్దరు అభ్యర్థులు  అతి తక్కువ ఓట్లతో  విజయం సాధించారు.  ఐదు వేల ఓట్ల మెజారిటీతో  ఐదుగురు అభ్యర్థులు  విజయం సాధించారు.

ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని  కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి 78 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వంశీ చంద్ రెడ్డ తన సమీప బీజేపీ అభ్యర్థి ఆచారిపై విజయం సాధించారు.  కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో రీ పోలింగ్ జరిగింది.రీపోలింగ్ జరిగిన ఈ గ్రామం గెలుపు ఓటములపై ప్రభావం చూపింది.

గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా వంశీ చంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఆచారి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా జైపాల్ యాదవ్ బరిలో దిగారు. ఈ దఫా కూడ ఈ ముగ్గురే పోటీ చేస్తున్నారు.  గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిగా ఉన్నాయి. ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతిస్తోంది. 2014 ఎన్నికలకు ముందే  టీడీపీ నుండి జైపాల్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరి  పోటీ చేశారు. 


నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి  గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా రాజేందర్ రెడ్డి పోటీ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో రాజేందర్ రెడ్డికి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. టీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి ద్వారా రాజేందర్ రెడ్డి ఆ ఎన్నికల్లో టీడీపీ టికెట్టును దక్కించుకొన్నారు.  2014 ఎన్నికల సమయంలో రాజేందర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

 టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన శివకుమార్  రెడ్డి పై ఆయన గెలిచారు. రాజేందర్ రెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.   రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో శివకుమార్ రెడ్డి ఆ పార్టీలో ఇమడలేకపోయారు.ఈ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు సాగింది. శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి టికెట్టు కోసం  తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఆయనకు టికెట్టు దక్కలేదు. దీంతో శివకుమార్ రెడ్డి  ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు

జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  మాజీ మంత్రి గీతారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావుపై గత ఎన్నికల్లో 842 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.వీరిద్దరే ప్రస్తుతం మరోసారి పోటీ చేస్తున్నారు.  ఒక్క దఫా మినహా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. గత ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సరోత్తం రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

చేవేళ్ల అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  కాలె యాదయ్య, టీఆర్ఎస్ అభ్యర్థిగా కేఎస్ రత్నంపై  781 ఓట్ల మెజారిటీతో గత ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందే చేవేళ్ల ఎమ్మెల్యేగా  కేఎస్ రత్నం అప్పటి తాండూరు టీడీపీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ లో చేరారు.వీరిద్దరూ కూడ 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా చేవేళ్ల, తాండూరు నుండి పోటీ చేసి గెలిచారు. 

రత్నం  టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై కాలె యాదయ్య విజయం సాధించారు.  చేవేళ్ల ఎమ్మెల్యే యాదయ్య కూడ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.  దీంతో కేఎస్ రత్నం, యాదయ్యల మధ్య ఆధిపత్య పోరు సాగింది.  యాదయ్యను టీఆర్ఎస్‌లోకి రాకుండా రత్నం అడ్డుకొన్నారు. కానీ  ఆయన ప్రయత్నాలు సఫలం కాలేదు. 2018 ఎన్నికలకు ముందు రత్నం టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం రత్నం  కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా యాదయ్య పోటీ చేస్తున్నారు.


ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి గత ఎన్నికల్లో  ఇండిపెండెంట్ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్ రావు పై టీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి 2,219 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో  పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు  ఈ దఫా కూడ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తలపడిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి( కాంగ్రెస్), బీజేపీ నుండి సంకినేని వెంకటేశ్వర్ రావు, టీఆర్ఎస్ నుండి  జగదీష్ రెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరారు. 


ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం 2370 ఓట్ల మెజారిటీతో గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఓటు బ్యాంకు ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది. నార్కట్ పల్లి మండలంలో కొన్ని గ్రామాల్లో ఉన్న సీపీఐ ఓటు బ్యాంకు కూడ కలిసొచ్చే ఛాన్స్ లేకపోలేదు.

గత ఎన్నికల్లో  ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కె. చందర్ పై టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ విజయం సాధించారు.  టీఆర్ఎస్ టికెట్టు దక్కని కారణంగా  చందర్  రెబెల్ గా  ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.  చందర్ పై సోమారపు సత్యనారాయణ 2,295 ఓట్లతో విజయం సాధించారు ఈ దఫా కూడ చందర్  టికెట్టు దక్కలేదు. దీంతో మరోసారి చందర్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.


తుంగతుర్తిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గ్యాదరి కిషోర్‌కుమార్‌ కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌పై 2,379 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు వారిద్దరూ అవే పార్టీల నుంచి ఒకరిపై ఒకరు తలపడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఉన్న రజనీకుమారి ఈసారి మద్దతు పలుకుతుండడంతో కాంగ్రెస్‌ బలం పెరిగింది. అయితే కాంగ్రెస్‌ రెబెల్‌ డాక్టర్‌ రవి బరిలో నిలిచారు. కాంగ్రెస్ టికెట్టు  రవికుమార్ కు దక్కలేదు. దీంతో  ఆయన రెబెల్‌గా బరిలో దిగారు.


మల్కాజ్‌గిరిలో టీఆర్‌ఎస్‌ నేత కనకారెడ్డి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై 2,768 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. ఈసారి బీజేపీ మళ్లీ రాంచందర్‌రావుకే టికెట్‌ ఇవ్వగా టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావును బరిలోకి దించింది. ప్రజా కూటమి తరఫున దిలీప్ కుమార్‌ (టీజేఎస్‌)  బరిలో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ తరపున మైనంపల్లి హన్మంతరావు ఈ స్థానం నుండి పోటీ చేయాలని భావించారు. బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా  ఈ స్థానాన్ని చంద్రబాబునాయుడు బీజేపీకి కేటాయించారు. దీంతో చివరి నిమిషంలో హన్మంతరావు టీఆర్ఎస్ లో చేరారు. మల్కాజిగిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అందోల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సినీ నటుడు బాబూమోహన్‌ గత ఎన్నికల్లో ఆనాటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహపై 3,291 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఈసారి టీఆర్‌ఎస్‌ బాబూమోహన్‌కు టికెట్‌ నిరాకరించడంతో ఆయన బీజేపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా అందోల్‌ నుంచే బరిలో దిగారు. కాంగ్రెస్‌ తరఫున మళ్లీ రాజనర్సింహే పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి  క్రాంతి కిరణ్‌ బరిలో ఉన్నారు. 

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో టీడీపీ అభ్యర్థి సాయన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గజ్జెల నగేశ్‌పై 3,275 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత సాయన్న టీఆర్‌ఎస్ లో చేరారు. ఈసారి టీఆర్‌ఎస్‌ నగేశ్‌కు కాకుండా టీడీపీ నుంచి వచ్చిన సాయన్నకు టికెట్‌ ఇచ్చింది. దీనిపై నగేశ్‌ ఆగ్రహించారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు.  మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.


మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఉద్యోగ సంఘ నేత శ్రీనివాస్‌గౌడ్‌ బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డిపై 3,139 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఈసారి కూడా శ్రీనివాస్‌గౌడ్‌ బరిలోకి దిగారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పి తెలంగాణ ఇంటి పార్టీలోకి వెళ్లారు. ప్రజా కూటమిలో భాగంగా ఆయన తనకు టికెట్‌ వస్తుందని ఆశించినా రాలేదు. అయితే ఇక్కడ టికెట్‌ దక్కిన ఎర్ర శేఖర్‌ (టీడీపీ)కి ఆయన మద్దతిస్తున్నారు. 


గత ఎన్నికల్లో పాలకుర్తిలో టీడీపీ నుంచి గెల్చిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో దేవరకొండ నుంచి రవీంద్రకుమార్‌ (సీపీఐ) 4216 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి బీల్యా నాయక్‌పై గెలుపొందారు. ఇప్పుడు రవీంద్రకుమార్‌ టీఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, బీల్యా నాయక్‌ బీఎల్‌ఎఫ్‌ నుంచి పోటీలో ఉన్నారు. 

2014లో పరిగి నుంచి రామ్మోహన్‌రెడ్డి (కాంగ్రెస్‌) 5,163 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా హరీశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌) ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి టీఆర్‌ఎస్‌ హరీశ్వర్‌రెడ్డి కుమారుడు కొప్పుల మహేశ్‌రెడ్డిని రామ్మోహన్‌రెడ్డిపై పోటీకి దించింది. 

వేములవాడలో చెన్నమనేని రమేష్‌ (టీఆర్‌ఎస్‌) చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన ఆది శ్రీనివాస్‌ (బీజేపీ) ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగడంతో మళ్లీ పాత ప్రత్యర్థుల మధ్య పోరు జరుగుతోంది. గతంలో బీజేపీకి మిత్రపక్షంగా ఆది శ్రీనివాస్‌కు మద్దతిచ్చిన టీడీపీ... ఇప్పుడు కాంగ్రెస్‌ మిత్రపక్షంగా అదే శ్రీనివాస్‌కు మద్దతిస్తుండడం విశేషం.
 
సంబంధిత వార్తలు

ఆసక్తికరం: జనాభాలో తక్కువే, పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ

వారసులు: తండ్రుల బాటలో ఆదిలాబాద్ నేతలు

నర్సంపేట: మద్దికాయల ఓంకార్‌ రికార్డ్ ఇదీ

ఇల్లెందు: డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

హేమాహేమీల అడ్డా: ఆ ప్రముఖులు ఇక్కడివారే

కారణమిదే: ఆ స్థానంలో ఇంతవరకు టీడీపీ గెలవలేదు