నర్సంపేట: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1972 నుండి 1989 వరకు వరుసగా నర్సంపేట అసెంబ్లీ స్థానం నుండి సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్ధిగా మద్దికాయల ఓంకార్ విజయం సాధించారు. ప్రజా సమస్యలపై పాలకపక్షంపై  నిలదీయడంలో ఓంకార్ ఏనాడు వెనుకంజ వేయలేదు.

నిజాం సర్కార్ పాలనలో ప్రస్తుతం వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండేవి. ప్రస్తుతం తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏపూరు ప్రాంతంలో మద్దికాయల ఓంకారు పుట్టాడు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఓంకార్ కీలకపాత్ర పోషించారు. ఈ పోరాటంలో భాగంగానే బీమిరెడ్డి నర్సింహ్మారెడ్డి నేతృత్వంలో ఓంకార్ పనిచేశారు. 

ఈ ఉద్యమ కాలంలోనే ఓంకార్ సీపీఎంలో చేరారు. పార్టీ అవసరాల రీత్యా ఓంకార్ వరంగల్ జిల్లాలో సీపీఎం నిర్మాణం కోసం ఆనాడు పంపించారు. దీంతో ఆయన నర్సంపేట ప్రాంతంలో పనిచేశారు. 

1972 లో జరిగిన ఎన్నికల్లో నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పెండెం కట్టయ్యపై ఓంకార్  సీపీఎం అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారిగా ఓంకార్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1978లో గంటా ప్రతాప్ రెడ్డి అనే కాంగ్రెస్ అభ్యర్ధిపై ఓంకార్ విజయం సాధించారు.

1983లో సీపీఎం అభ్యర్థిగా ఓంకార్ మరోసారి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పెండెం కట్టయ్యపై ఓంకార్ విజయం సాధించారు. సీపీఎంలో ఉన్న ఓంకార్‌పై  పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి.  పలు దఫాలు ప్రాణాపాయం నుండి ఓంకార్ తప్పించుకొన్నారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నెపంతో సీపీఎం నుండి మద్దికాయల ఓంకార్ ను పార్టీ నుండి సీపీఎం బహిష్కరించింది. ఆ తర్వాత 1985 ఎన్నికల్లో మద్దికాయల ఓంకార్ (ఎంసీపీఐ పేరుతో )ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సీపీఎం క్యాడర్ ఎక్కువగా ఓంకార్ వైపు వెళ్లింది.

1985లో జరిగిన ఎన్నికల్లో ఓంకార్ కాంగ్రెస్ అభ్యర్ధి మండవ ఉపేందర్ రావుపై విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఏపూరు జనార్ధన్ రెడ్డిపై ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఓంకార్ విజయం సాధించారు. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి రేవూరి ప్రకాష్ రెడ్డి 87 ఓట్లతో మద్దికాయల ఓంకార్ పై విజయం సాధించారు.

ఈ ఎన్నికల ఫలితాల సమయంలో అత్యంత ఉత్కంఠ నెలకొంది. రీ కౌంటింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలపై ఎంసీపీఐ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. 1994లో కూడ ఓంకార్ విజయం సాధిస్తే  నర్సంపేట అసెంబ్లీ స్థానం నుండి డబుల్ హ్యాట్రిక్ సాధించేవారు.

 

సంబంధిత వార్తలు

ఇల్లెందు: డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

హేమాహేమీల అడ్డా: ఆ ప్రముఖులు ఇక్కడివారే

కారణమిదే: ఆ స్థానంలో ఇంతవరకు టీడీపీ గెలవలేదు