ప్ర‌తీ ఏడాది మృగ‌శిర కార్తె రోజున చేప ప్ర‌సాదం పంపిణీ కార్య‌క్ర‌మం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఈ ఏడాది కూడా నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో చేప ప్ర‌సాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ప‌లు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజున నిర్వహించే చేప ప్రసాదం ఈసారి కూడా హైదరాబాద్‌లో ప్రారంభ‌మైంది. జూన్ 8 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ సేవ మొదలైంది. సోమ‌వారం ఉదయం వరకు చేప మందు పంపిణీ కొనసాగుతోంది.

 

బత్తినీ కుటుంబం సేవా

ఔషధ సంప్రదాయంగా నిలిచిన ఈ చేప ప్రసాదాన్ని గత కొన్ని దశాబ్దాలుగా బత్తినీ కుటుంబం అందిస్తోంది. ఈ సంవత్సరం కూడా వారు తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ లక్షన్నర చేపపిల్లలను పంపిణీకి సిద్ధం చేశారు. చిన్న చేపలో ఒక ఔషధ మిశ్రమాన్ని పెట్టి నోటికి వేయడం ద్వారా శ్వాస సంబంధిత రుగ్మతలకు ఉపశమనం లభిస్తుందని నమ్మకం ఉంది.

దేశ‌ న‌లుమూల‌ల నుంచి

తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి వేలాదిగా రోగులు హైదరాబాద్‌కు చేరుకుని ప్రసాదం కోసం బారులు తీరారు. గ్లౌకోమా, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందాలనే ఆశతో వారు వస్తున్నారు. చేప మందు తీసుకుంటే క‌చ్చితంగా ఫ‌లితం ఉంటుంద‌ని చాలా మంది విశ్వ‌సిస్తుంటారు.

అమ‌ల్లోకి ట్రాఫిక్ నిబంధ‌న‌లు.

చేప మందుకు వేలాదిగా ప్ర‌జ‌లు త‌ర‌లివస్తున్న నేప‌థ్యంలో అధికారులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. పోలీస్, వైద్య, మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. ఇందులో భాగంగానే ప‌లు ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి తీసుకొచ్చారు.

VIP కార్లు: ఎం.జె మార్కెట్ నుంచి వచ్చే వారు అజంతా గేట్, గాంధీభవన్ మీదుగా గేట్ నెం.1 లేదా CWC గేట్ వైపు లెప్ట్ తీసుకోవాలి.

ద్విచక్ర వాహనాలు: మనోరంజన్ కాంప్లెక్స్ వద్ద పార్క్ చేయాలి.

కార్లు: నాంపల్లి నుంచి వచ్చే వారు గృహ కల్ప మరియు BJP కార్యాలయం మధ్య ఉన్న రోడ్డుకు ఎడమవైపు పార్కింగ్ చేసుకోవాలి.

ఆటో రిక్షాలు: షేజాన్ హోటల్, భవానీ వైన్స్, జువెనైల్ కోర్టు, ఎక్సైజ్ కార్యాలయం వద్ద డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేశారు.

ట్రాఫిక్ మార్గం: ఎం.జె బ్రిడ్జి మరియు బేగంబజార్ చత్రి నుంచి నాంపల్లి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఇతర మార్గాల వైపు మళ్లిస్తున్నారు.

ఏవైనా ట్రాఫిక్ లేదా ప్రయాణానికి సంబంధించి సాయం కావాలంటే, 9010203626 నంబరుకు సంప్ర‌దించాల‌ని అధికారులు సూచించారు.