ఐటీ రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్ నగరం మరో ఐకానిక్ సెంటర్‌కు వేదికగా మారింది. ప్రముఖ సెర్చ్ కంపెనీ అయిన గూగుల్ హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించింది.
రేవంత్ రెడ్డి చేతుల మీదుగా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ప్రారంభమైంది. గతేడాది తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా గూగుల్ ఈ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది.
మాది ఇన్నోవేటివ్ ప్రభుత్వం
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ అని.. మాది ఇన్నోవేటివ్ ప్రభుత్వం అని తెలిపారు. నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశామన్న సీఎం.. ఉత్తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారుతోందన్నారు.
2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ మారాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రైజింగ్‌లో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తున్నామన్న సీఎం, తెలంగాణలో మహిళలు ధనిక పెట్టుబడిదారులకు పోటీదారులుగా మారుతున్నారన్నారు.
ఇక హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను(జీఎస్‌ఈసీ) ప్రారంభించడం సంతోషంగా ఉందన్న రేవంత్ రెడ్డి.. ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంగా మారుతోందని, డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉన్నట్లే అని చెప్పారు.

ఇంతకీ ఏంటీ జీఎస్‌ఈసీ.?
గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC) అనేది గూగుల్ నిర్వహించే ఒక ప్రత్యేక సెక్యూరిటీ వ్యవస్ధ అని చెప్పుకోవచ్చు. ఈ కేంద్రాల్లో ప్రైవసీ, వెబ్ సెక్యూరిటీ, కంటెంట్ సెఫ్టీ, AI ఆధారిత సైబర్‌సెక్యూరిటీ పరిష్కారాలను అభివృద్ధి చేస్తారు
ప్రపంచంలో మునిక్, డబ్లిన్, మలాగా వంటి కీలక కేంద్రాల ద్వారా గూగుల్ ఈ పనులు చేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో నాల్గవ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. భారతదేశంలో తొలి సెంటర్ ఇదే కావడం విశేషం.

ఉపయోగాలు ఏంటి.?
గూగుల్ GSEC కేంద్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా డిజిటల్ భద్రతా పరిష్కారాలు, సైబర్ సెక్యూరిటీపై పరిశోధన చేయడానికోసం ఏర్పాటుచేసింది. వ్యాపారాలు, ప్రభుత్వాలు, సాధారణ ప్రజలకూ మరింత మెరుగైన సైబర్ భద్రతను అందిస్తుంది.
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఐటీ, సైబర్ సెక్యూరిటీ కేంద్రంగా స్థాపించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రత సమస్యలను ఎదుర్కొనేందుకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనుంది.
తెలంగాణ ప్రభుత్వం చొరవ
గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టు విషయమై మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోటీ ఉండగా, హైదరాబాద్‌ను ఎంపిక చేయించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇక గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీ కల్పించే టీ ఫైబర్ ప్రాజెక్టు వంటి కార్యక్రమాలు కూడా GSEC ద్వారా చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

మరికొన్ని కీలక ప్రాజెక్టులు
తెలంగాణ ప్రభుత్వం గూగుల్‌తో కలిసి మరికొన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు చర్చలు జరుపుతోంది. వీటిలో ప్రధానంగా..
* హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి క్లౌడ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని యోచనలో ఉన్నారు.
* గూగుల్ మ్యాప్స్, లైవ్ కెమెరాలు, రియల్‌టైమ్ సిగ్నల్స్ ద్వారా దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత ట్రాఫిక్ సిస్టమ్‌ను హైదరాబాద్‌లో అమలు చేయనున్నారు.
* హైదరాబాద్‌ను ప్రపంచంలోని అత్యంత స్మార్ట్ నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో భారీ ప్రణాళికలు కొనసాగుతున్నాయి.
* రాష్ట్రంలోని పాఠశాలల్లో గూగుల్ సాంకేతికత ఆధారంగా విద్యా నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
* ఇన్నొవేషన్‌కి, స్టార్టప్‌ల అభివృద్ధికి తోడ్పడేలా గూగుల్ స్టార్టప్ హబ్ ఏర్పాటు చేయనున్నారు.
* యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సహాయంతో AI, సైబర్‌సెక్యూరిటీలో యువతకు నైపుణ్యాల్ని అందించనున్నారు.
