విలేకరి నుంచి ఎమ్మెల్సీ వరకు.. : తీన్మార్‌ మల్లన్న జర్నీ ఇదే

తీన్మార్ మల్లన్న. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. సాధారణ విలేకరిగా ప్రయాణం ప్రారంభించి... ఈ స్థాయికి ఆయనెలా ఎదిగారో తెలుసా...

From journalist to MLC..: This is the journey of Tinmar Mallanna

తెలంగాణలో నిర్వహించిన నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్‌ మల్లన్న విజయం దిశగా దూసుకెళుతున్నారు. ఈయనకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉంది. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ బుధవారం మొదలై... గురువారం రాత్రి వరకు కొనసాగింది. పోలైన మొత్తం మొదటి ప్రాధాన్య ఓట్లు 3లక్షల 36వేల 13లో తీన్మార్‌ మల్లన్నకు లక్షా 22వేల 813 ఓట్లు వచ్చాయి. 

భారత రాష్ట్ర సమితి ​అభ్యర్థి ఏనుగుల రాకేశ్​ రెడ్డికి లక్షా 4వేల 248 ఓట్లు వచ్చాయి. అంటే తొలి ప్రాధాన్య ఓట్లలో మల్లన్న 18వేల 565 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. 

అయితే పోలైన ఓట్లలో 50 శాతం పైచిలుకు ఓట్లు దక్కించుకున్న వారినే విజేతగా ప్రకటించాలన్నది రూల్‌. మరోవైపు తొలి ప్రాధాన్య ఓట్లలో 25వేల 877 చెల్లుబాటు కాలేదు. కాబట్టి చెల్లుబాటైన 3లక్షల 10వేల 136 ఓట్లలో సగానికి పైగా వచ్చినవారే విజేత అవుతారు. కానీ ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో గురువారం రాత్రి 9 గంటల నుంచి రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపును ఎన్నికల అధికారులు చేపట్టారు. ఇందులో 32వేల 282 ఓట్లు వస్తే మల్లన్న విజేత అవుతారు. రాకేశ్ రెడ్డి గెలవాలంటే మాత్రం 50వేల 847 ఓట్లు అవసరం. 

మొత్తం ఐదు రౌండ్ల రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో నాలుగు రౌండ్లు తీన్మార్‌ మల్లన్న ఆధిక్యం ప్రదర్శించారు. కానీ ఇవరి రౌండ్‌లో ఓట్లు తగ్గడంతో మెజార్టీ లేకుండా పోయింది. దీంతో ఎలిమినేషన్‌ రౌండ్‌ను ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం 52 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. లీడ్‌లో ఉన్న తీన్మార్‌ మల్లన్న, రాకేశ్‌ రెడ్డి, ప్రేమేందర్‌ రెడ్డి, అశోక్‌ కుమార్‌లకు మిగిలిన 48 మందికి వచ్చిన 10వేల 65 ఓట్లను బదిలీ చేస్తారు. ఇలా చేసిన విజేతకు అవసరమైన ఓట్లు సరిపోవు కాబట్టి... నాలుగు, మూడు స్థానాల్లో ఉన్న అశోక్ కుమార్(29,697), ప్రేమేందర్ రెడ్డి(43,313) ఓట్లను కూడా లెక్కిస్తారు. 

మూడేళ్ల క్రితం 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పట్లో పల్లా రాజేశ్వరరెడ్డికి, మల్లన్నకు గట్టి పోటీ జరిగింది. జేఏసీ నేత కోదండరామ్​కు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లను మల్లన్నకు ట్రాన్స్‌ఫర్‌ చేసినా పల్లా రాజేశ్వరెడ్డిని చేరుకోలేకపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మిగతా అభ్యర్థులకు ఉన్నందున తొలి ప్రాధాన్య ఓట్లలో లక్షా 22వేల పైచిలుకు ఓట్లు సాధించిన మల్లన్నే విజేత కానున్నట్లు తెలుస్తోంది. 

మల్లన్న ప్రయాణమిలా...

తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. 1983 జనవరి 17న తెలంగాణలోని ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాధాపురం గ్రామంలో జన్మించారు. ఓ సాధారణ విలేకరిగా ఆయన ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలో పాపులర్ అయిన తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్ పేరే ఇప్పుడాయన ఇంటిపేరు అయింది. తీన్మార్ మల్లన్నగానే చాలా మందికి పరిచయం. ఆ తర్వాత ఆయనే సొంతంగా ఓ న్యూస్ ఛానల్ ప్రారంభించి... తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరుపై విశ్లేషణలు చేయడం ప్రారంభించారు. ప్రధానంగా తెలంగాణలో గత ప్రభుత్వం అవలంబించిన విధానాలపై ఆయన పోరాటం చేశారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఓ ట్రెండ్ సృష్టించారని చెప్పవచ్చు. 

ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్న తీన్మార్‌ మల్లన్నపై అనేక మార్లు దాడులు సైతం జరిగాయి. పోలీసుల వేధింపులు, అరెస్టులు తప్పలేదు. పలు కేసుల కారణంగా ఆయన కొద్దిరోజులు జైలు జీవితం సైతం గడిపారు. 

గతంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిన తీన్మార్‌ మల్లన్న... వివిధ కారణాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ పార్టీ మద్దతుతోనే గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో పోటీ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios