హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు లీడర్ కాదని ఓ మేనేజర్ అంటూ విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ ఏపీలో చంద్రబాబు ఘోరాతి ఘోరంగా ఓడిపోతారన్నారు. 

తాను ఇచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ అద్భుతంగా ఉంటుందని కేసీఆర్ గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దారుణాతి దారుణంగా చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారన్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం తాను చేస్తున్న పోరాటం చిల్లరగాళ్లకు అర్థం కాదని విమర్శించారు. 

తాను ప్రారంభించింది మహాయజ్ఞమని చంద్రబాబులా హడావుడి చేయనన్నారు. తాను అనుకున్న దాంట్లో కాస్త టైమ్ పడుతుంది కానీ జరిగి తీరుతుందన్నారు. దేశ ప్రజలకు మంచి చెయ్యాలన్నదే తన తపన అంటూ చెప్పుకొచ్చారు. 

తమ అజెండా, తమ ఆర్థిక ప్రణాళిక ఇంకా బయటకు రాలేదని... రాజకీయంగా అందరిపై ఒత్తిడి పెంచుతున్నామన్నారు. అయితే ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. చంద్రబాబు ఏం చేయలేక మద్దెల దరువు అన్నట్లు తమపై పడి ఏడుస్తున్నారని విమర్శించారు. 

చంద్రబాబు పాలనలో విపరీతమైన అవినీతి పెరిగిందని కేసీఆర్ ఆరోపించారు. చంద్రబాబు పచ్చి రాజకీయ స్వార్థపరుడు, దద్దమ్మ, అబద్దాల కోరు అంటూ ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు స్వయం ప్రకాశమున్న నేత కాదని, మామ పెట్టిన పార్టీని చంద్రబాబు లాక్కొన్నారని కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

బీజేపీ యేతర కూటమికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడని సక్సెస్ అవుతున్నాడంటూ కొన్ని వార్తలు వస్తున్నాయని అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. చంద్రబాబుకు కనీసం తనకున్న రాజకీయ పరిజ్ఞానం కూడా లేదన్నారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారనడం అంతా కల్పనేనని కేసీఆర్ విమర్శించారు.

ఏ అంశం గురించి అయినా చంద్రబాబు నాయుడు ఇంగ్లీషులో మాట్లాడగలడా అని ప్రశ్నించారు. కనీసం ఉర్దూ అయినా వచ్చా అంటూ ప్రశ్నించారు. జాతీయ రాజకీయాలంటే సొల్లు చెప్పడం కాదన్నారు. 

చంద్రబాబు నాయుడుని ఏపీ ప్రజలు ఎలా భరిస్తున్నారో అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడుని ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వదిలేస్తుందని తాము వదలబోమని ఇక్కడ నుంచి మెుదలుపెడతామన్నారు. 

చంద్రబాబు నాయుడికి తనకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. తాను చెప్పింది మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చారు. అంతేకానీ చంద్రబాబులా సెల్ఫ్ డబ్బా కొట్టుకోనని రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు జెండాలు మార్చబోమన్నారు. 

తాను తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా కొట్లాడానో అందరికి తెలుసునన్నారు. కేవలం ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చానని కేసీఆర్ గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడుకు ఇంతమంది ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదా సాధించారా అంటూ నిలదీశారు. 
 
తాను ప్రతిపాదించే అర్థిక నమూనాపై చంద్రబాబుకు కనీస అవగాహన లేదని కేసీఆర్ విమర్శించారు. రైతుబంధు పథకాన్ని దేశం మొత్తం ఫాలో అవుతోందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని చెప్పారు. 

కల్యాణలక్ష్మి, ఇండస్ట్రీయల్ పాలసీలను చంద్రబాబు కాపీ కొట్టారని ధ్వజమెత్తారు. కనీసం ఈవోడీవోలో తాము చేసిన మిస్టెక్స్ ను సైతం అలాగే పొందుపరిచి తమ పథకంలా చెప్పుకొచ్చారన్నారు. కళ్యాణ లక్ష్మీ తమ పథకం కాకపోతే గత తొమ్మిదేళ్లలో ఎందుకు చెయ్యలేకపోయారంటూ కేసీఆర్ నిలదీశారు. 

మరోవైపు సైబరాబాద్ తానే నిర్మించానని పదేపదే చెప్తున్న చంద్రబాబుకు సిగ్గుందా అంటూ విమర్శించారు. ఐటీలో చంద్రబాబు పీకిందేమీలేదని ఘాటుగా విమర్శించారు. 
సైబర్‌టవర్స్‌కు పునాది వేసింది చంద్రబాబు కాదని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని కేసీఆర్ గుర్తు చేశారు. 

హైదరాబాద్‌ భౌగోళిక అనుకూలత వల్లే ఐటీ కంపెనీలొచ్చాయని, ఇందులో చంద్రబాబు గొప్పతనం ఏమీ లేదని విమర్శించారు. తాము కూడా నాలుగైదు పెద్ద ఐటీ కంపెనీలను తెచ్చామని, అయితే చంద్రబాబులా డబ్బా కొట్టుకోలేదని స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఆ పుణ్యం కట్టుకుంది ఎన్టీఆర్

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ రాస్తా: కేసీఆర్

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా కాస్కో,ఘోరంగా ఓడిపోతావ్: కేసీఆర్

హరికృష్ణ చావును కూడా రాజకీయం చేశాడు, అమాయకురాలిని బలిచేశాడు: కేసీఆర్

అప్పుడు మోడీ, ఇప్పుడు రాహుల్ గాంధీ సంకనాకుతున్న చంద్రబాబు

పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడిన వారికి కర్రు కాల్చి వాత పెట్టిన తెలంగాణ ప్రజలు: కేసీఆర్