హైద్రాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు అబద్దాలకోరు అంటూ ఘాటుగా విమర్శించారు. ప్రపంచంలో చంద్రబాబు నాయుడు లాంటి  డర్టీ పొలిటీషియన్ ఎవరూ ఉండరన్నారు. 
 
అవకాశానికి ఉపయోగించుకోవడం, వదిలించుకోవడం చంద్రబాబు నాయుడుకే తెలుసునన్నారు. హరికృష్ణ చనిపోవడాన్ని కూడా సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అమాయకురాలిని తీసుకువచ్చి బలిచేశాడని ధ్వజమెత్తారు. 

నందమూరి సుహాసినికి ఇప్పుడు ఏం చేస్తాడని ప్రశ్నించారు. కూకట్ పల్లిలో అమాయకురాలిని తీసుకు వచ్చి బలిచేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ కుటుంబాన్ని గాలికి వదిలేశాడని అన్నారు. గతంలో హరికృష్ణను కానీ హరికృష్ణ కుటుంబాన్ని కానీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఇలాంటి వ్యక్తిని ఏపీ ప్రజలు ఎలా భరిస్తున్నారంటూ ప్రశ్నించారు. 

ప్రపంచంలో సిగ్గు శరం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు.  హరికృష్ణ శవం మీద పేలాలు ఏరుకునేలా రాజకీయం చేశాడన్నారు. ఆయనది సెల్ఫ్ డబ్బా తప్ప ఇంకేమీ లేదన్నారు.