హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు.చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ దేశంలోనే ఎవరూ ఉండరన్నారు. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు అయ్యిందని పార్లమెంట్ సాక్షిగా విడిపోయిందన్నారు. తలకాయ మీద మెడకాయ ఉన్న ఎవరైనా హైకోర్టును తమ రాష్ట్రానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. చంద్రబాబుకి అది చేతకాదన్నారు. 

చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటకు తల తోక ఉండదన్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. తాము హైకోర్టు ఏపీకి వెళ్లిపోవాలని తాము అనలేదన్నారు. కోర్టును విభజించాలని అయితే వేరు వేరు భవనాలలో విధులు నిర్వహించుకుంటామని తాము అన్నామని తెలిపారు. 

అయితే చంద్రబాబు నాయుడు మాత్రం హైకోర్టును విభజించాలని, తాము డిసెంబర్ నెలాఖరులోపు హైకోర్టు ఏపీకి తీసుకెళ్లిపోతామని సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తరపున కోరింది చంద్రబాబు కాదా అంటూ నిలదీశారు. 

నాలుగేళ్లు మోడీ సంకనాకిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాహుల్ గాంధీ సంకనాకుతున్నాడంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడుకు సిగ్గు లజ్జా ఉందా అంటూ నిలదీశారు. ప్రత్యేక హోదా అవసరం లేదని ప్రత్యేక ప్యాకేజీ చాలు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు కాదా అని నిలదీశారు. 

రాహుల్ గాంధీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు అడ్డుకోవాలని పిలుపునిచ్చింది చంద్రబాబు  కాదా అన్నారు. కొద్ది రోజుల్లోనే ప్రధాని మోదీ ఏపీకి వస్తానంటే ఏ మెుహం పెట్టుకుని ఏపీకి వస్తారంటూ నిలదీస్తారని విరుచుకుపడ్డారు. నీది ఏ మెుహం అంటూ ధ్వజమెత్తారు. 

తాను ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ను కలిస్తే చంద్రబాబు కు వచ్చిన కష్టం ఏంటని నిలదీశారు. తాను ఎవరితో కలిస్తే ఆయనకు సంబంధం ఏంటని నిలదీశారు. చంద్రబాబుకు ఒక నీతి, నైతికత ఏమీ ఉండవన్నారు.