ఒడిశా రైలు ప్రమాదాన్ని దేశ ప్రజలెవరూ ఇంకా మర్చిపోకముందే అలాంటి ఘటనే హైదరాబాద్ - ఢిల్లీ మార్గంలో జరిగే అవకాశం ఉందని ఓ అజ్ఞాత వ్యక్తి రైల్వే శాఖకు లేఖ రాశాడు. జూలై మొదటి వారంలోనే ఇది జరుగుతుందని అందులో పేర్కొన్నాడు. దీంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది.
జూలై మొదటి వారంలో తెలంగాణలో బాలాసోర్ తరహా రైలు దుర్ఘటన పునరావృతమవుతుందని ఓ అజ్ఞాత వ్యక్తి రాసిన లేఖ వెలుగులోకి రావడంతో భారతీయ రైల్వే అన్ని జోన్లలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ కు గత నెల (జూన్) 30వ తేదీన ఈ లేఖ అందింది.
విమానంలో కూతురిని అనుచితంగా తాకాడని తోటి ప్రయాణికుడిపై తండ్రి ఆగ్రహం.. వీడియో వైరల్
ఆ లేఖలో హైదరాబాద్-ఢిల్లీ-హైదరాబాద్ మార్గంలో బాలాసోర్ తరహా రైలు ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో అత్యంత అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ అన్ని డివిజన్లను ఆదేశించింది. లేఖ అందిన వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) యూనిట్లు అప్రమత్తమయ్యాయి. అజ్ఞాత లేఖ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం అందించారని ‘టైమ్స్ నౌ’ కథనం పేర్కొంది.
అయితే ఈ లేఖ ఫేక్ అని రైల్వే శాఖ అంగీకరించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఛాన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అందువల్ల అన్ని డివిజన్లలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మత విభేదాలు సృష్టించే శక్తులపై పోరాడాలి - ఎన్సీపీ అధినేత శరద్ పవార్
జూన్ 2వ తేదీన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 287 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. 1,200 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా విషాదం రేకెత్తించింది. అయితే ఈ రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థలో బాహ్య జోక్యం ఉండే అవకాశం ఉందని భావించిన రైల్వే శాఖ.. అసలు దోషిని గుర్తించడానికి ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి పంపింది.
ఈ ఘటనపై కమిషనర్ రైల్వే సేఫ్టీ (సీఆర్ఎస్) జూన్ 29న ప్రాథమిక నివేదికను సమర్పించగా, సీబీఐ ఇంకా తన ఫలితాలను క్రోడీకరించే పనిలో ఉంది. మానవ తప్పిదం గణనీయమైన పాత్ర పోషించిందని సీఆర్ఎస్ నివేదిక సూచిస్తోంది. అయితే ఈ ఘటనకు దోహదం చేసిన విద్రోహ కోణాన్ని సీబీఐ దర్యాప్తు చేయనుంది.
