Hyderabad: హైదరాబాద్ పేరు మార్పుపై యోగి వర్సెస్ ఒవైసీ.. ఏమన్నారంటే?
హైదరాబాద్ పేరు మార్పుపై సీఎం యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ఇది బీజేపీ విభజన రాజకీయాలకు ప్రతీక అని అన్నారు. హైదరాబాద్, తెలంగాణ ప్రజలు వారికి సరైన సమాధానం చెబుతారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరు మార్పును బీజేపీ నేతలు లేవనెత్తారు. ఈ అంశంపై ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వర్సెస్ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీగా మారిపోయింది.
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇక్కడ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా మారుస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈ నగరాన్ని హైదరాబాద్‌గా మార్చిందని, తాము భాగ్యనగర్‌గా మార్చడానికి ఇక్కడికి వస్తున్నామని వివరించారు. శ్రీ భాగ్య లక్ష్మి ఆలయం ఇక్కడ ఉన్నదని, దీన్ని మళ్లీ భాగ్యనగర్‌గా మారుస్తామని తెలిపారు. ఈయన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి సమర్థించారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తామని చెప్పారు. ‘నేను అడుగుతున్నా.. హైదర్ ఎవరు? మనకు హైదర్ పేరు అవసరమా? ఈ హైదర్ ఎక్కడి నుంచి వచ్చాడు? మనకు హైదర్ అవసరమా?’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read: Rythu Bandhu: రైతు బంధు ఈ నెలలో లేనట్టే?.. కేసీఆర్ చెప్పిన డేట్ ఇదే
ఈ వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘ముందుగా ఈ భాగ్యనగర్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో వారిని అడుగుతున్నాను. ఈ పేరు ఎక్కడ రాసి ఉన్నది? మీరు హైదరాబాద్‌ను ద్వేషిస్తారు. అందుకే పేరు మార్చాలని అనుకుంటున్నారు. ఇది విద్వేషానికి ప్రతీక. హైదరాబాద్ మా గుర్తింపు, మా అస్తిత్వం. మీరు దీని పేరు ఎలా మారుస్తారు? వాళ్లు కేవలం ద్వేష రాజకీయాలు చేస్తున్నారు’ అని ఘాటుగా వ్యాఖ్యా నించారు. హైదరాబాద్ పేరు మార్చుతామని హామీ ఇవ్వడం బీజేపీ విచ్ఛన్న రాజకీయాలేనని వివరించారు. హైదరాబాద్, తెలంగాణ ప్రజలు వారికి దీటుగా సమాధానమిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.