Telangana Elections 2023 : పక్కా స్కెచ్ తో రంగంలోకి మోదీ, అమిత్ షా... టోటల్ ఎలక్షన్ మూడ్ నే మార్చేస్తారట?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కీలక నాయకులు పార్టీని వీడుతుండటంతో ఢీలా పడ్డ బిజెపిలో తిరిగి జోష్ నింపి పోటీలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ వున్నప్పుడు ఆ పార్టీ బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనే స్థాయికి చేరింది. బలమైన లీడర్లు, క్యాడర్ ను కలిగిన కాంగ్రెస్ పార్టీకి సంజయ్ ముచ్చెమటలు పట్టించారు. ఇలా బిజెపి మంచి జోరుమీదున్న సమయంలో అదిష్టానం నిర్ణయంతో ఒక్కసారిగా తెలంగాణలో పరిస్థితి తారుమారు అయ్యింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించడంతో ఒక్కసారిగా బిజెపిలోకి వలసలు ఆగిపోయాయి. ఇదే అదునుగా కాంగ్రెస్ యాక్టివ్ గా మారడంతో బిజెపి అంతకంతకు బలహీనపడింది. దీంతో బండి సంజయ్ హయాంలో బిజెపి గెలుపుపై ధీమాతో వున్న నాయకులంతా ఎన్నికల వేళ ఆ నమ్మకాన్ని కోల్పోయారు. దీంతో వివేక్, విజయశాంతి వంటి కీలక నాయకులు కూడా కాంగ్రెస్ లో చేరారు.
ఇలా ఢీలా పడ్డ తెలంగాణ బిజెపిని తిరిగి పోటీలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వీరు ఇక ఈ వారంరోజులు హోరెత్తించనున్నారు. తమదైన రాజకీయ అనుభవంతో వ్యూహాలు రచిస్తూ తెలంగాణ బిజెపిలో మళ్లీ ఊపు తేవాలని... పోలింగ్ నాటికి పరిస్థితిని మార్చాలని ప్రయత్నిస్తున్నారట. మోదీ, అమిత్ షా ఎంట్రీతో ఇప్పటివరకున్న తెలంగాణలో ద్విముఖ పోరు కాస్త త్రిముఖ పోరుగా మారనుందని... బిఆర్ఎస్,కాంగ్రెస్ లకు బిజెపి గట్టి పోటీ ఇస్తుందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం తెలంగాణకు చేరుకోనున్న ప్రధాని మొదట కామారెడ్డి వెళతారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పోటీచేస్తున్న ఈ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థికి మద్దతుగా ప్రధాని ప్రచారం చేపట్టనున్నారు. కామారెడ్డి బహిరంగ సభ అనంతరం నేరుగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ ప్రచారం ముగించుకుని రాత్రి రాజ్ భవన్ లో బస చేయనున్నారు.
ఇక ఆదివారం దుబ్బాక, నిర్మల్ లో ప్రచారం చేపట్టనున్నారు. సోమవారం మహబూబ్ నగర్, కరీంనగర్ లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం హైదరాబాద్ లోని వివిధ నియోజకవర్గాల్లో ప్రధాని రోడ్ షో చేపట్టనున్నారు. ఇలా మూడు రోజులపాటు ప్రధాని తెలంగాణలో ముమ్మర ప్రచారం చేపట్టనున్నారు.
ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నేటినుండి మూడు రోజుల పాటు తెలంగాణలోనే ప్రచారం చేపట్టనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం డిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు అమిత్ షా. ఇక్కడినుండి నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చేరుకుని బిజెపి సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొంటారు. అక్కడినుండి హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి... సాయంత్రం అంబర్ పేట నియోజకవర్గాల పరిధిలో రోడ్ షో చేపట్టనున్నారు.
ఇక 25న అంటే రేపు శనివారం ఉదయం 11 గంటలకు కొల్లాపూర్, మధ్యాహ్నం మునుగోడులో అమిత్ షా ప్రచారం చేపట్టనున్నారు. అక్కడినుండి తిరిగి హైదరాబాద్ చేరుకుని పటాన్ చెరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
26న అంటే ఆదివారం కూడా తెలంగాణలో ప్రచారం చేపట్టనున్నారు అమిత్ షా. ఉదయం 11 గంటలకు మక్తల్, మధ్యాహ్నం 1 గంటలకు ములుగు, 3 గంటలు భువనగిరిలో ప్రచారం చేపడతారు. సాయంత్రం 6 గంటలకు జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి కూకట్ పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇదేరోజు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవంలో అమిత్ షా పాల్గోంటారు.