జగదీష్ రెడ్డిని గెలిపించేందుకు నాకు టిక్కెట్టు ఇవ్వలేదు: కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి సంచలనం
సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి టిక్కెట్టు దక్కకపోవడంతో పటేల్ రమేష్ రెడ్డి అనుచరులతో సమావేశం కానున్నారు.పార్టీ నాయకత్వం చివరి నిమిషంలో టిక్కెట్టును మార్చే అవకాశం ఉందని ఆయన విశ్వాసంతో ఉన్నారు.
హైదరాబాద్: సూర్యాపేట స్థానం నుండి టిక్కెట్టు దక్కని కారణంగా కాంగ్రెస్ పార్టీ నేత పటేల్ రమేష్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించేందుకే రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టిక్కెట్టు కేటాయించారని పటేల్ రమేష్ రెడ్డి ఆరోపించారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిలు పోటీ పడ్డారు. చివరి నిమిషం వరకు ఈ టిక్కెట్టు కోసం ఉత్కంఠ సాగింది. చివరకు రాంరెడ్డి దామోదర్ రెడ్డికే కాంగ్రెస్ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించనప్పటికీ నిన్ననే రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిలు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న రాత్రి పది గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సూర్యాపేట నుండి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. దీంతో పటేల్ రమేష్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇవాళ అనుచరులతో పటేల్ రమేష్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలనే యోచనలో రమేష్ రెడ్డి ఉన్నారు.
also read:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023: భట్టి, ఈటల సహా పలువురు నామినేషన్ల దాఖలు
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ కీలక నేత జగదీష్ రెడ్డితో కుమ్మక్కయ్యారని పటేల్ రమేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కోవర్టులు, ముసుగు వీరుల కారణంగా తనకు టిక్కెట్టు రాకుండాపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2015లో రేవత్ రెడ్డితో పాటే పటేల్ రమేష్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన నాటి నుండి సూర్యాపేట నుండి పోటీ చేసేందుకు వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. గత ఎన్నికలతో పాటు ఈ దఫా ఎన్నికల్లో కూడ టిక్కెట్టు దక్కకపోవడంతో పటేల్ రమేష్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు టిక్కెట్టు మారే అవకాశం ఉందని ఆయన ఆశాభావంతో ఉన్నారు.
2014, 2018 ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధించారు. మరోసారి ఇదే స్థానం నుండి జగదీష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ దఫా కూడ కాంగ్రెస్ పార్టీ తరపున రాంరెడ్డి దామోదర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్ధిగా సంకినేని వెంకటేశ్వరరావు పోటీ పడుతున్నారు.