సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టంభనకు తెరదించింది. పెండింగ్‌లో వున్న ఐదు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. 
 

వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. సామాజిక సమీకరణలు, అంగ, అర్ధబలాలు, సర్వేల నివేదికలను సరిచూసుకుని అభ్యర్ధులను ప్రకటించింది. అయితే సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించడంలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమైన ఆయన.. పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించని సర్వేల నివేదికలు తెప్పించుకుని , నాయకుల ఎదుటే తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు. 

 

 

అలాగే సూర్యాపేటలో పటేల్ రమేశ్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డిలు టికెట్ ఆశించారు. వీరిద్దరూ కాంగ్రెస్‌కు విధేయులే. వీరిలో ఎవరికి టికెట్ కేటాయించినా.. మరొకరు సహకరించరు. ఇది ఇక్కడ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బ తీస్తుందని నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి తోడు ఇప్పటికే టికెట్లు కేటాయించిన చోట అసంతృప్తులు పార్టీని చికాకు పెడుతున్నారు. పటాన్ చెరులో నీలం ముదిరాజ్‌ను అభ్యర్ధిగా ప్రకటించగా..  బీఫామ్‌ను ఇవ్వలేదు. 

ఇక్కడ టికెట్ ఆశించిన కాట శ్రీనివాస్ గౌడ్‌కు మద్ధతుగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, నీలం మధుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అండగా నిలిచారు.  అయితే చివరికి సూర్యాపేటలో దామోదర్ రెడ్డికి అవకాశం కల్పించిన కాంగ్రెస్.. పటాన్‌చెరు విషయంలోనూ అభ్యర్ధిని మార్చింది. నీలం మధు స్థానంలో కాట శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ కేటాయించింది. తద్వారా జగ్గారెడ్డిపై దామోదర రాజనర్సింహ పైచేయి సాధించినట్లయ్యింది. అధిష్టానం ప్రకటనతో శుక్రవారం వీరంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 

కాంగ్రెస్ తుది జాబితా.. అభ్యర్ధుల వీరే :

పటాన్‌చెరు - కట్టా శ్రీనివాస్ గౌడ్
సూర్యాపేట -  రాంరెడ్డి దామోదర్ రెడ్డి
చార్మినార్ - షరీఫ్
మిర్యాలగూడ -బాతుల లక్ష్మారెడ్డి
తుంగతుర్తి (ఎస్సీ) మందుల శామ్యూల్