తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023: భట్టి, ఈటల సహా పలువురు నామినేషన్ల దాఖలు
రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతున్న పలు పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు రేపటితో గడువు ముగియనుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు పోటీ చేసే అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క మధిర అసెంబ్లీ స్థానం నుండి గురువారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ మంత్రి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈటల రాజేందర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. గజ్వేల్ లో ఈటల రాజేందర్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్ తో పాటు హుజూరాబాద్ లో కూడ ఆయన పోటీ చేస్తున్నారు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై ఈటల రాజేందర్ ను బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దింపింది.
also read:గ్రూప్ తగాదాలు వీడాలి: కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ వార్నింగ్
పాలేరు అసెంబ్లీ స్థానంనుండి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానం నుండి పటేల్ రమేష్ రెడ్డి కూడ నామినేషన్ వేశారు. సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. దీంతో ఈ మూడు స్థానాల్లో అభ్యర్ధుల పేర్లను ప్రకటించకున్నా కాంగ్రెస్ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు.
బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. జనసేనకు కేటాయించిన స్థానాలు మినహాయించి ఇతర స్థానాలతో బీజేపీ జాబితా విడుదల కావాల్సి ఉంది. అయితే నామినేషన్లు దాఖలు చేయాలని పార్టీ నాయకత్వం కొందరు అభ్యర్ధులకు సమాచారం పంపింది. ఇవాళ రాత్రికి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.