Telangana CM Revanth Reddy : సోనియా నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. రేవంత్ ట్వీట్ వైరల్
తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన కాంగ్రెస్ హైకమాండ్‌కు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్‌రావు థాక్రే, కాంగ్రెస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, నేతలకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. దీంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు.. తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన కాంగ్రెస్ హైకమాండ్‌కు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తనను సీఎల్పీ నేతగా తనను ఎన్నుకున్నందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్‌రావు థాక్రే, కాంగ్రెస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, నేతలకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు సుధీర్ఘ కసరత్తు, అనేక తర్జన భర్జనల అనంతరం రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. నిన్న సీఎల్పీ మీటింగ్ జరిగిందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. తమకు అధికారాన్ని అప్పగించిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీసుకున్నారని వేణుగోపాల్ వెల్లడించారు.
ALso Read: Telangana CM Revanth Reddy : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం
మంగళవారం ఉదయం నుంచి ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో సీఎం ఎంపికపై చర్చ జరిగిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుత పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకున్న అధిష్టానం రేవంత్ రెడ్డిని నూతన ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిందని వేణుగోపాల్ అన్నారు. డిసెంబర్ 7న తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన వెల్లడించారు.
రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేయడంతో అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, కొడంగల్‌లోని రేవంత్ రెడ్డి ఇళ్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. మా రేవంత్ పటేల్ .. సీఎం అయ్యాడని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకేనని వారు అంటున్నారు. రేవంత్ అప్పటికీ, ఇప్పటికీ మా మంచి పటేలే అని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇకపై మా వూరు కొండారెడ్డిపల్లి కాదని, సీఎం వూరని చెబుతున్నారు. ఎప్పుడు ఆయన ఊరికి వచ్చినా ఎంతో అప్యాయంగా పలకరిస్తారని తెలిపారు.