Telangana CM Revanth Reddy : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంపిక అయ్యారు. సుధీర్ఘ కసరత్తు, అనేక తర్జన భర్జనల అనంతరం రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 

anumula revanth reddy appointed as new cm of telangana by congress high command

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంపిక అయ్యారు. సుధీర్ఘ కసరత్తు, అనేక తర్జన భర్జనల అనంతరం రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. నిన్న సీఎల్పీ మీటింగ్ జరిగిందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. తమకు అధికారాన్ని అప్పగించిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీసుకున్నారని వేణుగోపాల్ వెల్లడించారు. 

 

 

మంగళవారం ఉదయం నుంచి ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో  సీఎం ఎంపికపై చర్చ జరిగిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుత పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకున్న అధిష్టానం రేవంత్ రెడ్డిని నూతన ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిందని వేణుగోపాల్ అన్నారు. డిసెంబర్ 7న తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన వెల్లడించారు. 

 

 

రేవంత్ ప్రస్థానం :

రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ నాయకులలో ఒక‌రిగా ఉన్న రేవంత్ రెడ్డి.. మొద‌ట మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ లో 2003లో టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్)లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రెండేళ్ల తర్వాత పోటీ చేసే అవకాశం రాకపోవడంతో ఆ పార్టీని వ‌దిలిపెట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, 2006లో జిల్లా పరిషత్ టెరిటోరియల్ కమిటీ (ZPTC) సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2008లో స్వతంత్ర అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికయ్యారు. అదే సంవత్సరం ఆయన తెలుగుదేశం పార్టీలో (టీడీపీ) చేరారు. 2009లో కొడంగల్ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు సాధించారు. టీడీపీ కీల‌క నేత‌ల్లో ఒక‌రిగా వెలుగొందుతున్న ఆయ‌న అసెంబ్లీలోనూ, ఇటు బ‌య‌ట రాజ‌కీయంగానే కాకుండా ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపును సాధించారు. 

2014లో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. అయితే, ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణలో టీడీపీ బలహీనపడింది.  2015లో శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అతడిని పట్టుకుంది. స్టీఫెన్‌సన్‌ ఫిర్యాదుతో ఏసీబీ ట్రాప్‌ చేయగా, రేవంత్‌రెడ్డి మరో ముగ్గురితో కలిసి రూ.50 లక్షల నగదుతో ఎమ్మెల్యే ఇంటికి రాగా.. వారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఎపిసోడ్ అంతాకూడా కెమెరాలో రికార్డైంది. బెయిల్ మంజూరు కాకముందే రేవంత్ రెడ్డి ఆరు నెలలకు పైగా జైలులో ఉన్నారు. అప్పటి నుంచి తక్కువ ప్రొఫైల్‌ను మెయింటెన్ చేస్తూ వస్తున్నాడు. 2017 అక్టోబర్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీకి కూడా రాజీనామా చేశారు. 'కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి' కోసం పోరాడుతానని ప్రతిజ్ఞ చేసి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అప్ప‌ట్లో రేవంత్ రాక‌ను వ్య‌తిరేకించిన కాంగ్రెస్ నాయ‌కులు చాలా మందే ఉన్నారు. అయితే, కాంగ్రెస్‌లో బలమైన నెట్‌వర్క్‌ని నిర్మించుకున్న ఆయన అనతికాలంలోనే అగ్ర నాయకత్వానికి దగ్గరయ్యారు. ఆయనకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి దక్కింది. 2018 ఎన్నికల ప్రచారంలో తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని దుమారం రేపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, కొన్ని నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఆయనను పోటీకి దింపింది. ఆయన విజయంతో పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కోసం పోరాడుతానని ప్రతిజ్ఞ చేసిన మాట‌ను ఇప్పుడు గుర్తుచేసుకునే ప‌రిస్థితిని క‌ల్పించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ కు పూర్వ వైభ‌వం తీసుకువ‌చ్చారు. రాష్ట్రంలో హస్తం పార్టీకి అధికారం దక్కించారు.  నిజంగానే రేవంత్ రెడ్డి ఒక ప‌డిలేచిన కేర‌టంలా స్ఫూర్తిని నింపే వ్య‌క్తిగా నిలిచారు...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios