CM KCR: కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చినా 4న కేసీఆర్ క్యాబినెట్ భేటీ నిర్వహించవచ్చునా?
సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఫలితాల మరుసటి రోజు సచివాలంలో క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చినా సీఎం కేసీఆర్ క్యాబినెట్ భేటీ నిర్వహించవచ్చునా? అనే సందేహాలు వస్తున్నాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ కీలక నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఆగం కావొద్దని నేతల్లో ధైర్యాన్ని నింపారు. అదే విధంగా డిసెంబర్ 4వ తేదీన మళ్లీ క్యాబినెట్ సమావేశం ఇదే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహిస్తామని చెప్పినట్టు తెలిసింది. ఈ ప్రకటనను ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికపై ధ్రువీకరించింది. డిసెంబర్ 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ట్వీట్ చేసింది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ పై సీఎం కేసీఆర్ స్పందించలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆయన మీడియా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన సచివాలయంలో కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఆగం కావొద్దని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీఆర్ఎస్ నేతల్లో ఆయన ధైర్యం చెప్పినట్టు సమాచారం. సచివాలయం నుంచి బీఆర్ఎస్ నేతలూ విక్టరీ సింబల్ చూపిస్తూ బయటకు వచ్చారు.
Also Read: Exit Polls: 2018లో సరిగ్గా అంచనా వేసిన సర్వే ఇప్పుడేం చెబుతున్నది?
ఇది ఒకవైపు ఉండగా.. డిసెంబర్ 3న ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చినా.. కేసీఆర్ సీఎం హోదాలో క్యాబినెట్ సమావేశం నిర్వహించవచ్చునా? అనే సందేహాలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీని చూపిస్తే.. అదే రోజు సాయంత్రంకల్లా సీఎం రాజీనామా ప్రకటించడం ఆనవాయితీగా చూస్తుంటాం. ఆయన రాజీనామాతో మంత్రిమండలి రద్దయినట్టు లెక్క. ఒక వేళ ఆయన రాజీనామా చేయకపోయినా క్యాబినెట్ భేటీ నిర్వహించడం అసాధ్యం అని కొందరు చెబుతున్నారు.
Also Read : Telangana Elections: మెజార్టీ రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. గులాబీ శిబిరం ధైర్యం ఇదే
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉండదని మరికొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి అని వివరిస్తున్నారు.
ఒక వేళ ఫలితాల్లో బీఆర్ఎస్ పరాజయాన్ని నమోదు చేసినా.. ఆయన క్యాబినెట్ నిర్వహించవచ్చునని మరికొందరు చెబుతున్నారు. అయితే, అది నామమాత్రపు క్యాబినెట్ భేటీ మాత్రమేనని, అందులో పాలనా పరమైన, విధాన పరమైన నిర్ణయాలేవీ ఉండవని వివరిస్తున్నారు. ఫలితాలపై చర్చించి మెజార్టీ సీట్లు దక్కకుంటే సీఎం కే చంద్రశేఖర్ రావు రాజీనామా చేసి మంత్రి మండలిని రద్దు చేస్తారని పేర్కొంటున్నారు. దీని పై గవర్నర్‌కు లేఖ పంపితే.. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలుపు ఇస్తారు. అప్పుడు ఏ పార్టీ అత్యధిక సీట్లు గెలిస్తే అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
Also Read: Prabhakaran: తమిళ టైగర్ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా సజీవంగా ఉన్నారు: ఎండీఎంకే నేత సంచలనం
ఒక వేళ బీఆర్ఎస్ పార్టీకే మెజార్టీ సీట్లు దక్కితే మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ద్వారా పిలుపు అందుకుని కొన్నాళ్లకు సీఎం, మంత్రలు ప్రమాణాలు తీసుకుని కొత్త క్యాబినెట్ ఏర్పడుతుంది. అప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం స్థానంలో బీఆర్ఎస్ పూర్తికాల ప్రభుత్వం ఏర్పడుతుంది. దీంతో సీఎం కేసీఆర్ క్యాబినెట్ భేటీ ప్రకటన బీఆర్ఎస్ వర్గాల్లో భరోసా నింపే వ్యూహంతో చేసినట్టే అని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.