Telangana Elections: మెజార్టీ రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. గులాబీ శిబిరం ధైర్యం ఇదే
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అవుతాయని, 70కి పైగా స్థానాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ చెబుతున్నది. ఒక వేళ ఎగ్జిట్ పోల్స్ నిజమైనా అంటే బీఆర్ఎస్ కేవలం 50 సీట్ల వద్దే నిలిచిపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సామర్థ్యం తమకు ఉన్నదని గులాబీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్ కంఫర్టబుల్ మెజార్టీ సాధించకుంటే చాలు అని, బొటాబొటీ మెజార్టీ సాధించినా పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల క్యాంపెయిన్ ముగిసేవరకు తమకే మెజార్టీ వస్తుందని బీఆర్ఎస్ కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా ప్రచారం చేసుకుంది. కానీ, పోలింగ్ తేదీన సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డ తర్వాత ఈ పార్టీల వాదనలు మారుతున్నాయి. ఒకింత బీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడినట్టు చర్చ మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని, 70కి పైగా స్థానాలతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ మాత్రం ముందు నుంచి అవలంభించిన దూకుడును.. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రావడంతో అదే విధంగా కొనసాగించింది. డిసెంబర్ 3వ తేదీ దాకా ఆగాల్సిన అవసరం లేదని, కార్యకర్తలు ఇప్పుడే బాధ్యతతో సంబురాలు చేసుకోవచ్చని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని, తమకు అనూహ్యంగా సీట్లు వస్తాయని, వచ్చే ప్రభుత్వంలో తాము కింగ్ మేకర్‌లంగా ఉంటామని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 60 సీట్లు అవసరం.
చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపాయి. ఎక్కువ సర్వేలు కాంగ్రెస్‌కు కంఫర్టబుల్ మెజార్టీ వస్తుందని అంచనా వేశాయి. సీఎన్ఎన్ వంటి కొన్ని మాత్రం మెజార్టీ మార్క్‌కు నాలుగు, ఐదు స్థానాలకు దూరంలో కాంగ్రెస్ నిలుచుంటుందని పేర్కొన్నాయి. ఇక బీఆర్ఎస్ 40 స్థానాల నుంచి 55 స్థానాల మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నదని సర్వేలు తెలిపాయి. ఇంకొన్ని సర్వేలైతే సుమారు 30 సీట్ల వరకే గెలుచుకుంటుందనీ చెప్పాయి. చాలా వరకు సర్వేలు బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని తెలిపాయి. బీజేపీ ఐదు నుంచి ఆరు స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఎంఐఎం పార్టీ గతంలో లాగే ఏడు స్థానాలను గెలుచుకుంటుందని, ఒక సీటు ఓడిపోయే ముప్పునూ ఆ పార్టీ ఎదుర్కొంటున్నదని వివరిస్తున్నారు.
Also Read: LPG Cylinder Price: ఎన్నికలు ముగియగానే గ్యాస్ బాదుడు.. పెరిగిన సిలిండర్ ధర
అంచనాలు ఇలా ఉన్నా గులాబీ దళంలో మాత్రం ఆత్మవిశ్వాసం పాళ్లు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వారు చెబుతున్నారు. మొదట.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అవాస్తవాలనీ, మెజార్టీ సీట్లు తమకే వస్తాయని వాదిస్తున్నారు. ఒక వేళ మెజార్టీ రాకున్నా ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామనీ ఈక్వేషన్లు తీస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ రెండింటి మధ్య అవగాహన ఉన్నది. కాబట్టి, నాలుగైదు స్థానాలు మెజార్టీ మార్క్‌కు తక్కువగా వచ్చినా ఎంఐఎం మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. లేదూ.. ఎగ్జిట్ పోల్స్ తరహాలోనే కనీసం 50 సీట్లు వచ్చినా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనీ అంటున్నారు. ఎంఐఎం మద్దతుతోపాటు అవసరమైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతునూ తాము పొందగలని చెబుతున్నారు. లేదంటే బయటి నుంచి బీజేపీ మద్దతునూ తాము కూడగట్టుకోగలమని విశ్లేషణలు ఇస్తున్నారు. కానీ, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలిసి ఒకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం సాధ్యం కాదనే మరో కోణం ఇక్కడ చర్చకు వస్తున్నది. కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించకుంటే చాలు అని, ఎందుకంటే ఆ పార్టీకి ఇతర పార్టీల మద్దతు పొందే అవకాశాలు చాలా తక్కువ అని వివరిస్తున్నారు. గులాబీ పార్టీకి మద్దతు పొందే.. లేదా హస్తం పార్టీ నుంచీ ఎమ్మెల్యేలను ఆకర్షించే సామర్థ్యం ఎక్కువ అనేది రాజకీయ వర్గాల గుసగుసల్లో వినిపిస్తున్నది.
Also Read: Exit Polls: 70కి పైగా స్థానాలకు బీఆర్ఎస్‌కే.. 3న మీడియా క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది: కేటీఆర్
కాంగ్రెస్ కంఫర్టబుల్ మెజార్టీ సీట్లు గెలిస్తేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలదని, లేదంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరడం ఖాయం అనే చర్చ కూడా జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అటూ ఇటూగా 55 స్థానాలు సాధించినా ఇతర పార్టీల నుంచి మద్దతు లభించడం చాలా కష్టమని, గతంలో ఎంఐఎంతో పొత్తు చరిత్ర ఉన్నప్పటికీ ఆ పార్టీని హస్తం తన వైపు లాక్కోవడం కష్టమేనని చెబుతున్నారు. ఎందుకంటే.. అదే స్థాయిలో బీఆర్ఎస్ సీట్లను సాధించే పరిస్థితి ఉంటే ఎంఐఎం గులాబీ పార్టీవైపే మొగ్గుచూపుతుందని విశ్లేషణ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ గెలుపు గుర్రాలున్నాయనే మరో ఆరోపణలు చాన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే గెలిచే అవకాశాలు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను బెంగళూరు క్యాంప్‌నకు తరలించాలనే యోచనలు చేస్తున్నట్టు వార్తలు వస్తుండటం గమనార్హం.