Exit Polls: 2018లో సరిగ్గా అంచనా వేసిన సర్వే ఇప్పుడేం చెబుతున్నది?
2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సరైన అంచనాలు చెప్పిన ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ ఈ సారి కూడా ఎగ్జిట్ పోల్స్ వెలువరించింది. 2018లో బీఆర్ఎస్‌కు మెజార్టీ సీట్లు వస్తాయని చెప్పిన ఈ సంస్థ ఈ సారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేసింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు ముగిశాయి. ఇదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఇందులో చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా అంచనాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించే అవకాశాలు ఉంటాయని, బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంటే బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే అనూహ్యంగా పుంజుకుంటుందని తెలిపాయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతుండగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అవాస్తవ అంచనాలు ప్రచారం చేస్తున్నాయని కొట్టిపారేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాత్రం తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వేను గుర్తు చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సర్వే అంచనాలు నిజమయ్యాయి. ఈ సర్వే చెప్పినట్టే బీఆర్ఎస్ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2018లో ఈ సర్వే అంచనాలు ఏమిటీ?
2018 అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనాలను వెలువరించింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్ పార్టీ) మెజార్టీ సాధిస్తుందని తెలిపింది. బీఆర్ఎస్ 62 నుంచి 70 సీట్లు, కాంగ్రెస్ 32 నుంచి 38 సీట్లు, టీడీపీ 1 నుంచి 3 సీట్లు, బీజేపీ 6 నుంచి 8 సీట్లు, ఇతరులు 6 నుంచి 8 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఈ ఫలితాలు చెప్పినట్టుగానే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Also Read: Chhattisgarh Exit Polls: ఛత్తీస్‌గడ్‌లో పోటాపోటీ.. కాంగ్రెస్‌కే మొగ్గు!
2018 ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయి?
బీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 19 సీట్లను, టీడీపీ 2 సీట్లను గెలుచుకున్నాయి. బీజేపీ ఒక్క సీటు, ఎంఐఎం ఏడు సీట్లను గెలుచుకుంది. ఒక్కరు స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
2023 ఎన్నికలపై అంచనాలేమిటీ?
ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీఆర్ఎస్ గద్దె దిగి వెళ్లిపోతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 63 నుంచి 79 స్థానాలను గెలచుకుంటుందని, బీఆర్ఎస్ 31 నుంచి 47 స్థానాలను గెలుచుకోవచ్చని ఈ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేస్తున్నది.