kodangal నియోజకవర్గంలో ఉద్రిక్తత: బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ... కేసు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం నాడు రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.
కొడంగల్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం నాడు రాత్రి భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోస్గి, బొంరాస్‌పేటల్లో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి.
శనివారం నాడు రాత్రి కోస్గి పట్టణంలో తమపై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగినట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కోస్గి పోలీస్ స్టేషన్ లో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ కార్యకర్త కూర నరేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
also read:Raavi Narayana Reddy:నెహ్రు కంటే అత్యధిక ఓట్లు సాధించిన సీపీఐ నేత రావి నారాయణ రెడ్డి
ఇక బొంరాస్ పేటలో జీహెచ్ఎంసీ బోరబండ కార్పోరేటర్ ఫసియుద్దీన్ కు కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘర్షణలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. తనపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడినట్టుగా కార్పోరేటర్ ఫసియుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరిన తర్వాత 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా రేవంత్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
also read:Kamareddyలో ఉద్ధండుల పోరు:కేసీఆర్, రేవంత్ ...వెంకటరమణరెడ్డిలలో ఓటర్ల పట్టం ఎవరికో?
ఆ తర్వాత 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. గతంలో ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పలు దఫాలు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిథ్యం వహించిన గుర్నాథరెడ్డి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. రేవంత్ రెడ్డి కోసం గుర్నాథరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. 2009 ఎన్నికల్లో గుర్నాథరెడ్డిపైనే రేవంత్ రెడ్డి విజయం సాధించారు.
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టు కోసం బీఆర్ఎస్,కాంగ్రెస్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇటీవలనే రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.