Kamareddyలో ఉద్ధండుల పోరు:కేసీఆర్, రేవంత్ ...వెంకటరమణరెడ్డిలలో ఓటర్ల పట్టం ఎవరికో?


కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నెలకొంది.ఈ  నియోజకవర్గంలో  కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండడంతో  ఆసక్తి నెలకొంది. 

Telangana assembly elections 2023:Triangular contest takes shape in Kamareddy segment lns

కామారెడ్డి: కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్ధండులు పోటీ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు  తెలుగు ప్రజలంతా ఈ నియోజకవర్గ తీర్పు ఎలా ఉంటుందని ఆసక్తిగా చూస్తున్నారు.

కామారెడ్డి  అసెంబ్లీ  నియోజకవర్గం నుండి  తెలంగాణ సీఎం, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ బరిలోకి దిగారు. కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తుండడంతో  కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. గతంలో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి  మాజీ మంత్రి షబ్బీర్ అలీ  కాంగ్రెస్ అభ్యర్ధిగా పలు దఫాలు  ప్రాతినిథ్యం వహించారు.  ఈ దఫా  మాత్రం షబ్బీర్ అలీ బదులుగా రేవంత్ రెడ్డిని బరిలోకి దింపింది కాంగ్రెస్.ఇక భారతీయ జనతా పార్టీ తరపున కె. వెంకటరమణ రెడ్డి బరిలోకి దిగారు.

ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే  గంప గోవర్థన్  గతంలో టీడీపీ అభ్యర్ధిగా  ఈ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో  గంప గోవర్ధన్  టీడీపీని వీడి  బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ సీఎం కేసీఆర్  పూర్వీకుల  గ్రామం  ఈ నియోజకవర్గంలో ఉంటుంది.  దీంతో  కేసీఆర్ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని  స్థానిక  ఎమ్మెల్యే గంప గోవర్థన్ కోరారు. పైకి చెబుతున్న కారణంగా ఈ విషయాన్ని చెబుతున్నారు. అయితే  నిజామాబాద్ జిల్లాలో పార్టీ అవసరాల రీత్యా  కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగుతున్నారనే  ప్రచారం కూడ లేకపోలేదు.  గజ్వేల్ లో  ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్నందున  కేసీఆర్ కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారని  ఆయన ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు.

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లక్షల 52 వేల మంది ఓటర్లున్నారు. వీరిలో  మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.  1 లక్షా 30 వేల మహిళా ఓటర్లుంటే , 1 లక్షా  22 వేల పురుష ఓటర్లున్నారు.మహిళా ఓటర్లను ఆకట్టుకొనేందుకు అన్ని పార్టీలు  తమ ప్రయత్నాలను చేస్తున్నాయి.

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో  ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అభ్యర్ధి తరపున  ఈ నెల  25న ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్  దాఖలు చేసిన రోజునే  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభను నిర్వహించింది.ఈ సభలో  కర్ణాటక సీఎం సిద్దరామయ్య  పాల్గొన్నారు. ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ  కామారెడ్డిలో కూడ  రేవంత్ రెడ్డి  ప్రచారం నిర్వహిస్తున్నారు. కామారెడ్డిలో  రేవంత్ రెడ్డి  తరపున మాజీ మంత్రి షబ్బీర్ అలీ  ప్రచారం చేస్తున్నారు.  తాను  పోటీ చేస్తున్న నిజామాబాద్ అర్బన్ తో పాటు  కామారెడ్డిలో కూడ  షబ్బీర్ అలీ ప్రచారం చేస్తున్నారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని బాధిత గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ  గతంలోనే  కామారెడ్డి మున్సిపాలిటీ  నిర్ణయం తీసుకుంది. అయితే  ఈ విషయమై  బాధిత గ్రామాల ప్రజలు  మాత్రం మాస్టర్ ప్లాన్ విషయమై కొంత ఆందోళనతో ఉన్నారు. ఈ విషయమై విపక్షాలు  అధికార భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా  ప్రచారం చేసుకుంటున్నారు. భూముల కోసమే  కేసీఆర్  కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి  విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయమై  బీఆర్ఎస్ శ్రేణులు కూడ ఎదురు దాడికి దిగుతున్నాయి.  రేవంత్ రెడ్డి   ప్రచారాన్ని తిప్పి కొడుతున్నాయి.  ఓటుకు నోటు కేసులో ఉన్న వ్యక్తి తనపై  పోటీ చేస్తున్నాడని  రేవంత్ రెడ్డిపై  కేసీఆర్ విమర్శలు చేశారు.  

also read:Telangana assembly Elections 2023:2004 సెంటిమెంట్ కాంగ్రెస్ కు కలిసి వస్తుందా?

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు  ఆయా పార్టీల గెలుపు ఓటములపై  ప్రభావం చూపుతారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఆకట్టుకొనేందుకు  ఆయా పార్టీలు  ప్రయత్నాలను  ప్రయత్నిస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలో  ముస్లింలు, పద్మశాలీ, ఆర్యవైశ్య సామాజిక వర్గాల ఓటర్లు  ప్రభావం చూపించనున్నారు. కామారెడ్డిలో  ఆయా పార్టీల గెలుపు ఓటములను కామారెడ్డి అర్బన్ ఓటర్లు ప్రభావితం చేయనున్నారు.

also read:Raavi Narayana Reddy:నెహ్రు కంటే అత్యధిక ఓట్లు సాధించిన సీపీఐ నేత రావి నారాయణ రెడ్డి

తెలంగాణ ఉద్యమం సాగిన సమయంలో  కామారెడ్డి ఉద్యమానికి కేంద్రంగా నిలిచింది. ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడానికి ఇది కూడ  ఒక కారణంగా చెబుతారు.  ఇప్పటివరకు  నిర్వహించిన అభివృద్దితో పాటు  రానున్న రోజుల్లో చేయనున్న అభివృద్ది గురించి బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం మాదిరిగా  రానున్న రోజుల్లో కామారెడ్డి కూడ  అభివృద్ధి జరగనుందని  బీఆర్ఎస్ నేతలు  హమీ ఇస్తున్నారు.

also read:Telangana assembly Elections 2023: ఓటరు గుర్తింపు కార్డు లేదా... ఈ కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు

అయితే  గజ్వేల్  లో అభివృద్ది  చేస్తే  అక్కడి నుండి పారిపోయి కామారెడ్డికి ఎందుకు వచ్చారని రేవంత్ రెడ్డి  ప్రశ్నిస్తున్నారు.

కామారెడ్డిలో ఇప్పటి వరకు  విజయం సాధించిన అభ్యర్థులు వీరే

1.1952-57 జి. విఠల్ రెడ్డి (కాంగ్రెస్)
2.1952-57 వి.రామారావు (కాంగ్రెస్)
3.1957-62 ఎన్. సదాలక్ష్మి (కాంగ్రెస్)
4.1962-67 విఠలారెడ్డ గారి  వెంకటరమణా రెడ్డి (కాంగ్రెస్)
5.1967-72 ఎం. రెడ్డి (ఇండిపెండెంట్)
6.1972-78 వై. సత్యనారాయణ(కాంగ్రెస్)
7.1978-83 బి. బాలయ్య (కాంగ్రెస్)
8.1983-85 పి. గంగయ్య (తెలుగుదేశం)
9.1985-89 ఎ. కృష్ణమూర్తి (తెలుగుదేశం)
10.1989-94 మహమ్మద్ అలీ షబ్బీర్ (కాంగ్రెస్)
11.1994-99 గంప గోవర్థన్ (తెలుగుదేశం)
12. 1999-2004 మహమ్మద్ యూసుఫ్ అలీ(తెలుగుదేశం)
13.2004-09 మహమ్మద్ అలీ షబ్బీర్ (కాంగ్రెస్)
14.2009-12 గంప గోవర్థన్ (తెలుగుదేశం)
15.2012-14  లో ఉప ఎన్నిక గంప గోవర్థన్ (బీఆర్ఎస్)
16.2014-18 గంప గోవర్థన్ (బీఆర్ఎస్)
17.2018 నుండి గంప గోవర్థన్ (బీఆర్ఎస్)

ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న గంప గోవర్థన్ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. అయితే ప్రస్తుతం  బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు కూడ  ఓసీ సామాజిక వర్గానికి చెందినవారు. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు  కామారెడ్డి నుండి కూడ బరిలోకి దిగుతున్నారు. కేసీఆర్  గజ్వేల్ తో పాటు  కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారు.

బీజేపీ అభ్యర్ధి వెంకటరమణారెడ్డికి స్థానికంగా పట్టుంది.  కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటంలో వెంకటరమణారెడ్డి కీలకంగా వ్యవహరించారు.తనను గెలిపిస్తే నియోజకవర్గానికి ఏం చేయనున్నామో  రూ. 150 కోట్లతో  వెంకట రమణారెడ్డి  మేనిఫెస్టోను  ప్రకటించారు.

also read:Kodad Assembly Segment... కోదాడ నుండి ఎమ్మెల్యేలుగా: 2014లో అసెంబ్లీకి ఎన్. ఉత్తమ్,పద్మావతి దంపతులు

ఇదిలా ఉంటే  కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కామారెడ్డి నియోజకవర్గానికి రావాలంటే  అవసరమైన కాలువల నిర్మాణం పూర్తి కాలేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కేసీఆర్ ను ఈ నియోజకవర్గం నుండి గెలిపిస్తే  కామారెడ్డిలో  సాగు నీటి సమస్య ఉండదని  బీఆర్ఎస్ నేతలు హామీలిస్తున్నారు.  కేసీఆర్, రేవంత్ రెడ్డి లు స్థానికేతరులని  బీజేపీ అభ్యర్ధి వెంకటరమణరెడ్డి  ప్రచారం  చేస్తున్నారు. స్థానికుడినైన తనను గెలిపించాలని బీజేపీ అభ్యర్ధి కోరుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios