Exit Polls: 70కి పైగా స్థానాలకు బీఆర్ఎస్‌కే.. 3న మీడియా క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది: కేటీఆర్
70 స్థానాలకు పైగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుని తీరుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఈ ఎగ్జిట్ పోల్స్ నాన్సెన్స్ అని అన్నారు. అవాస్తవ ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన మీడియా సంస్థలు డిసెంబర్ 3వ తేదీన క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వివరించారు.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ చివరి దశకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు పోలింగ్ పూర్తయింది. అయితే.. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ జరుగుతున్నది. సాధారణంగా పోలింగ్ పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల అవుతుంటాయి. అయితే, సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని సీఈవో వికాస్ రాజ్ అనుమతి ఇచ్చారు. దీంతో తెలంగాణతోపాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.
ఎన్నికలు ఇంకా పూర్తి కాకముందే.. ఇప్పటికీ ఇంకా చాలా మంది పోలింగ్ కేంద్రాల్లో ఉండి ఓటు వేయబోతున్న తరుణంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించడం సమంజసం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇంకా పోలింగ్ కేంద్రాల్లో ఉన్నవాళ్లనూ ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయని తెలిపారు. అందుకే తాను మీడియా చానెల్స్‌ను సంప్రదిస్తే ఎన్నికల సంఘం తమకు అనుమతి ఇచ్చిందని సమాధానమిచ్చినట్టు వివరించారు.
Also Read: Telangana Exit Polls: తెలంగాణలో కాంగ్రెస్ పై‘చేయి’.. పుంజుకున్న బీజేపీ
2018లో కూడా ఇలాగే అనేక రకాల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయని, కానీ, బీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని కేటీఆర్ అన్నారు. ఇవన్నీ నాన్సెన్స్, న్యూసెన్స్ అని తెలిపారు. ఈ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మాల్సిన పని లేదని చెప్పారు. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల సంఘం ఫలితాలను వెల్లడిస్తుందని, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ 70కి పైగా స్థానాలను గెలుచుకుని తీరుతుందని స్పష్టం చేశారు. 80 స్థానాలకు పైగా గెలుస్తామని అనుకుంటున్నామని, కానీ, కచ్చితంగా 70కి పైగా స్థానాలను మాత్రం గెలుచుకుని తీరుతామని అన్నారు.
Also Read: Telangana Exit Polls: తెలంగాణలో హంగ్.. కాంగ్రెస్ విజృంభణ
కాబట్టి, ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్న ఈ అంచనాలు అవాస్తవాలుగా మిగులుతాయని కేటఆర్ చెప్పారు. అంతిమంగా ఇది ఆ ఎగ్జిట్ పోల్స్ వెలువడిస్తున్న మీడియా సంస్థలపై విశ్వసనీయతను దెబ్బతీస్తాయని వివరించారు. ఈ అవాస్తవ ఎగ్జిట్ పోల్స్ వెలువరించి మీడియా సంస్థలు తమపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని స్వయంగా దెబ్బతీసుకోవడమే అని పేర్కొన్నారు. అంతేకాదు, డిసెంబర్ 3వ తేదీన ఈ మీడియా సంస్థలు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.