LPG Cylinder Price: ఎన్నికలు ముగియగానే గ్యాస్ బాదుడు.. పెరిగిన సిలిండర్ ధర
అసెంబ్లీ ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో.. అలా గ్యాస్ ధరలు పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ. 21 ధర పెంచినట్టు చమురు కంపెనీలు వెల్లడించాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ ధర అమల్లోకి వస్తాయని తెలిపాయి.
హైదరాబాద్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో.. అలా వంట గ్యాస్ ధర పెరిగింది. తెలంగాణ సహా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 3వ తేదీన వెలువడనున్న సంగతి తెలిసిందే. చిట్ట చివరిగా నిన్ననే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇవాళ వంట గ్యాస్ ధర పెంచినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.
ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి హెచ్చాయి. కమర్షియల్ బండ ధరపై రూ. 21 పెంచారు. అదే గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ మొద్దుపై ధరలు మాత్రం పెరగలేదు. వీటి ధరలు యథాతథంగానే కొనసాగుతున్నాయి. కమర్షియల్ సిలిండర్‌లపై పెరిగిన ధరలు ఈ రోజు అంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.
గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నెల క్రితం అంటే నవంబర్ 1వ తేదీన కమర్షియల్ సిలిండర్ పై రూ. 100 వడ్డింపు అమలు చేశారు. అయితే, అదే నెల 16వ తేదీన ఈ ధరను రూ. 57 తగ్గించారు. కానీ, మళ్లీ ఇప్పుడు పెంచారు. దీంతో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ బండ ధర పెరిగింది. ఢిల్లీలో రూ. 1796.50, కోల్‌కతాలో రూ. 1908, ముంబైలో 1749, చెన్నైలో 1968.50గా దీని ధర ఉన్నది.
Also Read: ఏకంగా 50 మీటర్ల ఎత్తైన మొబైల్ టవర్ నే ఎత్తుకెళ్లారు..
అదే గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర యథాతథంగా రూ. 903కే అందుబాటులో ఉంటుంది. రవాణా చార్జీ, ఇతర అంశాల దృష్ట్యా పలు రాష్ట్రాల్లో ఈ సిలిండర్ ధరలో స్వల్ప తేడాలు ఉంటాయి.
కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం మూలంగా చిన్ని చిన్ని హోటళ్లు, మొదలు పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో అవి అమ్మే ప్రొడక్ట్‌లపై ధరలు ప్రభావితం అవుతాయి. విహార యాత్రలకూ బడ్జెట్ భారం అవుతుంది. కమర్షియల్ సిలిండర్ ఉపయోగించే రోడ్డు పక్కన బండ్లు, టీ కొట్లు, ఫాస్ట్‌పుడ్ సెంటర్లు ఇతరత్రా నిర్వహించే వారిపై ఈ భారం పడుతుంది. అంతిమంగా అది వినియోగదారులపై ప్రభావం వేస్తుంది.
ప్రతి నెల 1వ తేదీన వంట గ్యాస్ మరియు ఏటీఎఫ్ ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సవరిస్తుంటాయి.