Gangula Kamalakar: వెలమల కోటలో బీసీ గొంతుక.. మాస్ లీడర్ గంగుల కమలాకర్ గురించి తెలుసా?
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గంగుల కమలాకర్ పాగా వేసుకుని ఉన్నారు. హ్యాట్రిక్ విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆయన ఇప్పుడు నాలుగో విజయం కోసం ఎదురుచూస్తున్నారు. మాస్ లీడర్‌గా పేరున్న గంగుల కమలాకర్ కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చారు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన కౌన్సిలర్ నుంచి మంత్రిగా ఎదిగారు.
హైదరాబాద్: కరీంనగర్ వెలమల కోటగా ప్రతీతి చెందింది. ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇక్కడ తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. ఈ వెలమల కోటలో ఇప్పుడు బీసీ గొంతుక వినిపిస్తున్నది. ఆ గొంతుక బీసీ సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ది. గంగుల కమలాకర్ కింది నుంచి ఎదిగి వచ్చిన మాస్ లీడర్.
వ్యక్తిగత జీవితం:
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో లక్ష్మీ నర్సమ్మ, మల్లయ్య దంపతులకు 1968 మే 8వ తేదీన గంగుల కమలాకర్ జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువు ప్రారంభించిన ఆయన కరీంనగర్‌లోని ప్రైవేటు స్కూల్‌లో టెన్త్ పూర్తి చేశారు. కరీంనగర్‌లోని సైన్స్ వింగ్ ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ కంప్లీట్ చేసిన గంగుల కమలాకర్‌ను ప్రభుత్వ ఇంజినీర్‌గా చూడాలని అనుకున్న తండ్రి మల్లయ్య మహారాష్ట్రలో సివిల్ ఇంజినీరింగ్ చదివించారు.
రాజకీయ ప్రస్థానం:
గంగుల కమలాకర్ కాలేజీ రోజుల నుంచే కళాశాల వెలుపలి అంశాలపై ఆసక్తి ఎక్కువ. మిత్రులతో ఎంజాయ్ చేస్తూనే రాజకీయ విషయాలపైనా ఆసక్తిని పెంచుకున్నారు. టీడీపీ ద్వారా గంగుల రాజకీయ ప్రస్థానం మొదలైంది. టీడీపీ యువజన విభాగంలో క్రియాశీలకంగా పని చేసిన ఆయన టీడీపీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2000 నుంచి 2005 వరకు కరీంనగర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా, 2005 నుంచి 2009 వరకు నగరపాలక సంస్థ కార్పొరేటర్‌గా చేశారు. తనకంటూ ఒక బలమైన క్యాడర్‌ను, అభిమానులను తయారు చేసుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ బరిలో దిగారు.
Also Read: Telangana Elections: మెజార్టీ రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. గులాబీ శిబిరం ధైర్యం ఇదే
ఎమ్మెల్యేగా తొలి విజయం:
టీడీపీ టికెట్ పై 2009లో గంగుల కమలాకర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తొలిసారి పోటీ చేసినా 30,450 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం వీస్తున్నాయి. ఆ సందర్భంలోనూ టీడీపీ నుంచి గంగుల అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయంలో టీడీపీ అనుసరించిన ద్వంద్వ విధానాలతో గంగుల కమలాకర్ తీవ్ర ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ సాకారం కావడానికి సుమారు ఏడాది ముందు ఆయన అప్పటి టీఆర్ఎస్‌లో చేరారు. టీడీపీ రాజీనామా చేసి 2013 ఏప్రిల్‌లో గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారారు.. కానీ, తన దూకుడును ఎప్పట్లాగే కొనసాగించారు. ప్రజల్లో తన అభిమానాన్ని, ఆదరణ నిలుపుకోగలిగారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 24,750 ఓట్ల మెజార్టీతో, 2018లో 14,976 ఓట్ల మెజార్టీతో గంగుల కమలాకర్ గెలుపొందారు.
Also Read: CM KCR: కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చినా 4న కేసీఆర్ క్యాబినెట్ భేటీ నిర్వహించవచ్చునా?
నాలుగో గెలుపు కోసం..:
తొలిసారి చల్మెడ లక్ష్మీనరసింహారావును, 2014, 2019లో బండి సంజయ్‌ను గంగుల కమలాకర్ ఓడించారు. హ్యాట్రిక్ విజయం సాధించిన గంగుల నాలుగో సారి గెలుపు కోసం ఎదురుచూస్తున్నారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్‌ను 2019 సెప్టెంబర్ 8వ తేదీన కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి కీలక నేత ఈటల రాజేందర్ పార్టీ మారడంతో కేసీఆర్‌కు ఇప్పుడు గంగుల కమలాకర్ ముఖ్యనేతగా మారారు.
Also Read: Barrelakka: బర్రెలక్క వెనుక ఎవరు ఉన్నారు? గెలిస్తే ఏ పార్టీలోకి వెళ్లుతుంది?
ఐటీ వర్స్, మిషన్ భగీరథ, మానేర్ పై సస్పెన్షన్ బ్రిడ్జీ నిర్మాణం, లోయర్ మానేర్ ప్రాంగణంలో పర్యాటక ప్రాంతంగా సుందరీకరణ పనులు చేపట్టడం, స్మార్ట్ పనులు చేపట్టడం గంగుల కమలాకర్‌కు మంచి పేరును తెచ్చిపెట్టాయి.