హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్రమోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడకు వెళ్లినా తానేదో పెద్ద దేశభక్తుడిని అని చెప్పుకుంటూ తిరుగుతారని విమర్శించారు. 

హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ దేశభక్తిపై గొప్పలు చెప్తున్న మోదీ దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. దేశభక్తుడు అని చెప్పుకునే వ్యక్తి విద్వేషాలు రెచ్చగొడతారా అంటూ విరుచుకుపడ్డారు. 

దేశ ప్రజలకు సంబంధించిన సొమ్మును 15 మంది దోపిడీదారులకు కట్టబెట్టడమే దేశభక్తా అంటూ ప్రశ్నించారు. రాఫెల్ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దోచెయ్యడమేనా దేశభక్తి అంటూ నిలదీశారు. 

భారతదేశం సరిహద్దుల్లోకి చైనా సైన్యం దూసుకువస్తుంటే ప్రతిఘటించేందుకు చర్యలు తీసుకోకుండా ఆ దేశ అధ్యక్షుడితో ఛాయ్ తాగుతున్న మోదీయా దేశభక్తుడు అంటూ ధ్వజమెత్తారు. 

చైనా-భారత్ సరిహద్దు ప్రాంతమైన డోక్లా వద్ద చైనా సైన్యం భారత్ లోకి వస్తుంటే శాంతికి చర్యలు తీసుకోవాల్సిన మోదీ చైనా అధ్యక్షుడి చేతులు పట్టుకుని వచ్చేశారంటూ మండిపడ్డారు. మరోవైపు పుల్వామాలో ఉగ్రవాద దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోతే స్పందించకుండా సినిమా షూటింగ్ లో గడిపారంటూ విమర్శించారు. 

నేషనల్ జియోగ్రఫీ ఛానెల్ కు సంబంధించి షూటింగ్ లో పాల్గొన్నారని ఇదీ మోదీకి ఉన్న దేశభక్తి అంటూ మండిపడ్డారు. సైనికులు చనిపోతే ఇలానా వ్యవహరించేది అని విరుచుకుపడ్డారు. ఉగ్రవాద దాడి జరిగి మూడున్నర గంటల తర్వాత అది కూడా సినిమా షూటింగ్ పూర్తైనప్పుడు స్పందించారని తెలిపారు. 

ఇది మోదీకి, బీజేపీకి ఉన్న దేశభక్తికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. తాను ఎవరిముందు తలవంచనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బ్రిటీష్ వాళ్లను తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. 

దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇద్దరు ప్రధానమంత్రులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనని చెప్పుకొచ్చారు. సమయం ఆసన్నమైంది ప్రజలు మేల్కొనాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ దేశం నుంచి మోదీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణలో ఉన్న ప్రతీ కార్యకర్త మోదీ గురించి ప్రజలకు వివరించాలని చెప్పుకొచ్చారు. నరేంద్రమోదీకి కేసీఆర్ భక్తుడిగా మారాడన్న విషయాన్ని ప్రజలకు చేరవెయ్యాలని సూచించారు. 

భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేసేలా, భారత ప్రజల గొంతు నొక్కేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజల గొంతును కాపాడుతుందని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నీరవ్ మోడీ జేబులో మోదీ డబ్బులేస్తే, నేను పేదవాడి అకౌంట్లో వేస్తా: రాహుల్ గాంధీ

మోదీ చేతిలో కేసీఆర్ అవినీతి చిట్టా, అందుకే రిమోట్ అయ్యారు: రాహుల్ గాం