హైదరాబాద్: భారతదేశాన్ని రెండుగా విభజించిన వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. శంషాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ దేశాన్ని రెండుగా విభజించి చోద్యం చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

ఒక భాగం ధనికుల దేశంగా మరో భాగం పేదలదేశంగా విభజించారంటూ మండిపడ్డారు. అనిల్ అంబానీ లాంటి 15 మంది పెట్టుబడుదారులకోసం ఒక దేశాన్ని ఏర్పాటు చేశారంటూ విరుచుకుపడ్డారు. 

నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ లాంటి వారు లక్షల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని దేశాలు విడిచి పారిపోతారు. వారిని పట్టుకునే ప్రయత్నం చెయ్యరు. వారిని దేశానికి తీసుకొచ్చే ప్రయత్నించరని ధ్వజమెత్తారు. 

రైతులు తమ రుణాలను మాఫీ చెయ్యాలని చేతులెత్తి మెుత్తుకుంటున్నా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాత్రం పట్టించుకోరని తెలిపారు. భారతదేశంలో ఉన్న నిరుద్యోగులంతా ఉద్యోగాలు కావాలని చేతులెత్తి కోరుతున్నా మోదీ మాత్రం మాటలతో కాలయాపన చేస్తున్నారంటూ విమర్శించారు. 

స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటూ బిల్డప్ లు ఇస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. లోక్ సభలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మోదీకి మద్దతుగా నిలుస్తున్నారని ఆ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. నోట్ల రద్దును తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు ప్రకటిస్తారని చెప్పుకొచ్చారు. 

నోట్ల రద్దువల్ల నిరుద్యోగులు, ప్రజలు నానా ఇబ్బందులు పడితే కేసీఆర్ మాత్రం మంచి పని చేశారంటూ కితాబులిస్తారంటూ చెప్పుకొచ్చారు. చిరువ్యాపారులు నష్టపోయేలా జీఎస్టీని అమలులోకి తెస్తే కేసీఆర్ మాత్రం పట్టించుకోకుండా మద్దతు పలుకుతారని తెలిపారు. 

రాఫెల్ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి అనిల్ అంబానీకి కట్టబెట్టిందని ఆరోపించారు. రాఫెల్ విమానాల ఉత్పత్తిని హెచ్ఏఎల్ కు అప్పగిస్తే మోదీ మాత్రం 526 కోట్ల రూపాయలతో తయారు కావాల్సిన రాఫెల్ యుద్ధవిమానాన్ని 1600 కోట్లు ఖర్చుపెట్టి యుద్ధవిమానాలు తయారు చేయిస్తూ అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు.

30వేల కోట్ల రూపాయలను  వాయుసేన నుంచి దోచేస్తున్నారంటూ ఆరోపించారు. అనిల్ అంబానీ జీవితంలో ఏనాడు ఏ ఒక్క యుద్ధ విమానాన్ని తయారు చెయ్యలేదని స్పష్టం చేశారు.   రాఫెల్ కుంభకోణంలో ఎన్నిసార్లు కేసీఆర్ ప్రశ్నించారని నిలదీశారు. 

ఏనాడైనా 30వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని మోదీని కానీ బీజేపీని కానీ నిలదీశారా అంటూ కేసీఆర్ ని ప్రశ్నించారు. రాఫెల్ కుంభకోణాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేసీఆర్ ప్రధానిగా నరేంద్రమోదీని కొనసాగించాలన్న లక్ష్యంతో నిలదియ్యడం లేదన్నారు. 

నరేంద్రమోదీ చేస్తున్న అవినీతి కేసీఆర్ కు తెలుసునన్నారు. నరేంద్రమోదీ చేతిలో కేసీఆర్ అవినీతి చిట్టా ఉందని అందువల్లే కేసీఆర్ మోదీ చేతిలో రిమోట్ అయ్యారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.