న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ విపణిలో దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్ సహా ఇతర దిగ్గజ సంస్థలకు దీటుగా విక్రయాలను చేస్తున్న చైనా సంస్థ షియోమీ తాజాగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే  చైనాలో అతి పెద్ద ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఉత్పత్తిదారుగా షియోమీ నిలిచింది. 

భారత మార్కెట్లోకి విస్తరణకు షియోమీ ప్రణాళికలు
తాజాగా షియోమీ తన పోర్ట్‌ఫోలియోను భారత దేశానికి విస్తరించాలని చూస్తోంది.  ఇప్పటికే మొబైల్‌ ఫోన్లతోపాటు, ఇతర గ్యాడ్జెట్లను విడుదల చేస్తున్న షియోమీ.. తాజాగా షూలను కూడా అందుబాటులోకి తెచ్చింది. తాజాగా వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కూలర్లను భారత మార్కెట్లోకి విస్తరించాలని యోచిస్తున్నది. 

భారత్‌లోకి షియోమీ ఉత్పత్తులు తెస్తాం
షియోమీ ఆన్‌లైన్‌ సేల్స్ ఇండియా హెడ్‌ రఘు రెడ్డి గురువారం న్యూఢిల్లీలో రెడ్‌మీ 7, 7ప్రో స్మార్ట్‌ ఫోన్లను షియోమీ విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ ‘చైనాలో షియోమీ 80 నుంచి 100 విభాగాల్లో వస్తువులను విక్రయిస్తోంది. భారత్‌లో కేవలం 10-12 రకాలను మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరిన్ని విభాగాల్లో వస్తువులను భారత్‌లో విక్రయించాలని భావిస్తున్నాం’అని అన్నారు. 

షియోమీ ఆన్ లైన్ సేల్స్ ఇండియా హెడ్ ఇలా
ఎప్పుడు ఆయా వస్తువులను తీసుకొస్తారన్న ప్రశ్నకు స్పష్టమైన షియోమీ ఆన్‌లైన్‌ సేల్స్ ఇండియా హెడ్‌ రఘు రెడ్డి సమాధానం ఇవ్వలేదు.  వాషింగ్‌ మెషిన్లు, ఏసీలను భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. కౌంటర్‌ పాయింట్ నివేదిక ప్రకారం 2018లో షియోమీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ వాటా ఏకంగా 28శాతంగా ఉండగా, ఆ తర్వాత 24 శాతంతో శాంసంగ్‌ ఉండటం గమనార్హం.

రూ.12,999లకే షియోమీ స్మార్ట్‌టీవీ
షియోమీ భారత మార్కెట్లోకి మరో స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆధారిత 32 అంగుళాల స్మార్ట్‌ టీవీని సంస్థ భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. 'ఎంఐ ఎల్‌ఈడీ 4ఏ ప్రో' పేరుతో దీన్ని సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.12,999గా నిర్ణయించారు. 

ఏడో తేదీ నుంచి ఆన్‍లైన్‌లో సేల్స్ షురూ
32 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే , 1366 ప్లస్ 768 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ ఫిక్చర్‌, ఒక జీబీ ర్యామ్‌, 8ఈ ఎంఎంసీ స్టోరేజ్‌, లేటెస్ట్‌ అమ్లోజిక్‌ 64 బిట్‌ ప్రాసెసర్‌ విత్‌ 7వ జనరేషన్‌ ఇమేజింగ్‌ ఇంజీన్‌, గూగుల్‌ అసిస్టెంట్‌, బ్లూ టూత్‌, ఎంఐ రిమోట్‌లు ఈ టీవీలోని ఇతర ప్రత్యేకతలు. ఈ నెల 7వ తేదీ నుంచి మై హౌం, ఎంఐ.కాం, ఫ్లిప్‌కార్ట్‌ పోర్టల్స్‌ ద్వారా ఈ టీవీ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

స్మార్ట్ టీవీల నుంచి లాప్‌టాప్‌ల వరకు విస్తరిస్తున్న షియోమీ
స్మార్ట్ టీవీలతోపాటు ఎయిర్ ఫ్యూరిఫయర్లు, సెక్యూరిటీ కెమెరాలు, వాటర్ ప్యూరిఫయర్లు, లాప్‌టాప్‪లు భారత్ మార్కెట్లోకి తీసుకొస్తామని షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ తెలిపారు. ముందుగా రెండు, మూడు ఉత్పత్తులు చిన్న క్యాటగిరీల్లో ఆవిష్కరిస్తామని తెలిపారు.